హనుమకొండ చౌరస్తా, జూలై 10 : కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ రావడం ఎంతో గర్వకారణమని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాక్ బెంగళూర్ కాకతీయ విశ్వవిద్యాలయానికి ఏ-ప్లస్ గ్రేడింగ్‌ను శనివారం సాయంత్రం ప్రకటించిందని, న్యాక్ స్టాండింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఈ ప్రకటన వెల్లడైందని చెప్పారు. సెవెన్ పాయింట్ సేల్‌లో కేయూ 3.27 సోర్ సాధించిందన్నారు.
ఈ గ్రేడింగ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరివిగా ఫండ్స్, నూతన ప్రాజెక్ట్‌లు పొందడానికి వెసులుబాటు వస్తుందని తెలిపారు. వీటితో పాటు విదేశీ సంస్థలతో ఒప్పందాలు, ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడికి అవకాశం ఉంటుందని చెప్పారు. తద్వారా అకాడమిక్, రీసెర్చ్ పొడిగింపు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. న్యాక్ అక్రిడిటేషన్ ద్వారా మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు అంచనాలు వేసుకొని నిరంతర ముల్యాంకనానికి అవకాశం ఉంటుందన్నారు.
ది బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తూ నాణ్యమైన ఉన్నత విద్య అందించడం, విశ్వవిద్యాలయ పేరు ప్రతిష్టలు పెంచడానికి అడుగులు వేయడం, నూతన కోర్సులు, పద్ధతుల ద్వారా టీచింగ్, లెర్నింగ్, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంపు, ప్రాంగణ నియామకాల్లో మంచి వేతన ప్యాకేజీ పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం చరిత్రలో మొదటిసారిగా క్యాటగిరి-1 కింద చట్టబద్ధ సంస్థల నుంచి స్వయం ప్రతిపత్తి పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కేయూ దూరవిద్య కేంద్రం ఇక నుంచి నేరుగా యూజీసీ-డీఈబీ నుంచి నూతన కోర్సుల ఆమోదం పొందుతుందన్నారు.
కేయూ గ్రేడ్ల వివరాలు..
కేయూ న్యాక్ అక్రిడిటేషన్ నాలుగో సైకిల్లో భాగంగా 2023వ సంవత్సరంలో న్యాక్ ఏ-ప్లస్ సాధించిందని వీసీ తెలిపారు. మొదటి సైకిల్ 2003లో బీ-గ్రేడ్, రెండో సైకిల్ 2009లో ఏ-గ్రేడ్, మూడో సైకిల్ 2017లో ఏ-గ్రేడ్ సాధించిందన్నారు. ఈ సారి ఏ-ప్లస్ గ్రేడ్ పొందడంలో విశేషంగా కృషి చేసిన డీన్లు, విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు, పరిపాలనా అధికారులు, బోధనేతర సిబ్బందికి వీసీ కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి అధికారులు నవీన్‌మిట్టల్, వాకాటి కరుణ, పాలక మండలి సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. సంవత్సరం నుంచి ఈ ప్రాసెస్‌లో ఎంతో శ్రమకోర్చిన అకడమిక్ అడ్వైజర్, ఐక్యూఏసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్‌తో విశ్వవిద్యాలయ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. నాణ్యమైన, మెరుగైన, విద్యను అందించడానికి, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నూతన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించే దిశగా అడుగులు వేయాలన్నారు.
భవిష్యత్ కార్యక్రమాలు..
ఒప్పందాలు.. సేవలు..