పాలకుర్తి, నవంబర్ 9: ప్రభుత్వ వైఫల్యం.. పోలీసుల నిర్లక్ష్యం.. కాంగ్రెస్ నాయకుల ప్రోద్భలంతో పోలీస్‌స్టేషన్ సాక్షిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న గిరిజన బిడ్డ లకావత్ శ్రీను కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో శ్రీను కుటుంబసభ్యులకు ఎర్రవల్లిలోని తన ఇంటిలో కేసీఆర్ రూ.3 లక్షల చెక్కును పార్టీ పరంగా అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగ డం లేదని గిరిజన బిడ్డ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడమంటే అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు.
ఆయన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే జనవరిలో శ్రీను ఇంటికి వస్తానని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కేసీఆర్ సూచించారు. అధైర్యపడకండి.. భవిష్యత్ బీఆర్దేనని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అరెస్టులు, ప్రభుత్వ ప్రతీకార చర్యలకు బీఆర్ఎస్ శ్రేణు లు భయపడొద్దన్నారు. కార్యక్రమంలో జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీ నాయక్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, గిరిజన సంఘాల నాయకులు జర్పుల బాలునాయక్, ధరావత్ రాంసింగ్ నాయక్, శ్రీను కుటుంబ సభ్యులు లకావత్ సోమన్న, లకావత్ యాకూబ్ పాల్గొన్నారు.