ఖానాపురం, జనవరి 21 : ఉమ్మడి వరంగల్ జి ల్లాలోనే గొప్ప పర్యాటక ప్రదేశంగా పాకాల పేరుగాంచింది. చుట్టూ ఎత్తైన గుట్ట లు, దట్టమైన అడవులు, పక్షుల కిలకిలరావాలు సెలయేటి సవ్వడులతో సహజమైన అందాలు పాకాల సొంతం. సమైక్య పాలనలో పాకాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాకాల అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. ఇప్పటికే పాకాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి శాశ్వత జలవనరులు కల్పించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేశారు.
పాకాలలో ఏడు అధునాతన కాటేజీల నిర్మాణం, ఔషధ మొక్కల పార్కు, సీతాకోకచిలుకల పార్కు, పర్యావరణ అధ్యయన కేంద్రం, పాకాల వ్యూ పాయింట్ అభివృద్ధి పనులను చేపట్టింది. వీటికి తోడు ఎకో టూరిజాన్ని పర్యాటకులకు చేరువ చేసేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రైవేట్ భాగస్వామ్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ క్యాంపింగ్, ట్రెక్కింగ్ పేరుతో పాకాల వ్యూ పాయింట్ వద్ద నిర్వాహకులు సృజన్, మేనేజర్ పృథ్వీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విచ్చేసి రాత్రివేళల్లో బసచేయడానికి అనుగుణంగా టెంటెడ్ విధానంలో ఏర్పాట్లు చేపట్టారు.
ఇద్దరు నుంచి 20 మంది వరకు బస చేసేలా ఏర్పా ట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల కోసం ప్రతి రోజూ ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు వసతి కల్పించనున్నారు. పాకాలలో బస చేసే పర్యాటకులకు సాయంత్రం స్నాక్స్‌తో పాటు రాత్రి డిన్నర్, మరుసటి రోజు ఉదయం టిఫిన్ సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఒక్కొక్కరికి పెద్దలకు రూ.1500 ఉంటుందన్నారు. పాకాలలో రాత్రి వేళలో బసచేయాలనుకునేవారు 8125238653 నంబరు ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. పాకాల విశిష్టతను తెలియజేసేలా గైడ్‌ను ఏర్పాటు చేశారు.