వరంగల్, సెప్టెంబర్ 19 : విద్యార్థులకు ఖగోళ శాస్త్ర వి జ్ఞానాన్ని అందించే ప్రతాపరు ద్ర నక్షత్రశాల పదేళ్లుగా మూ తపడింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆవరణలో రెండున్నర దశాబ్ధాల క్రితం హిందూజ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అయితే ప్లానిటోరియంను పునరుద్ధరించడంలో బల్దియా పాలక వర్గం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నది.
స్మార్ట్‌సిటీ నిధులు రూ. 2 కోట్లతో భవనానికి మరమ్మతు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. స్మార్ట్‌సిటీ పథకం గడువు ముగియడంతో నక్షత్రశాల పునరుద్ధరణకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో స్టాంప్ డ్యూటీ నిధులే శరణ్యమని చెబుతున్న అధికారులు దీనిని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపై సమాధానం దాటవేస్తున్నారు. స్టాంప్ డ్యూటీ నిధులు రూ. 4 కోట్లు కేటాయించామంటున్నా.. ఇంతవరకు టెండర్ ప్రక్రియను నిర్వహించకపోవడం గమనార్హం.
ప్రతాపరుద్ర నక్షత్రశాల పునరుద్ధరణపై హిందూజ సంస్థ పలుమార్లు లేఖలు రాసినప్పటికీ బల్దియా అధికారులు స్పందించలేదు. నక్షత్రశాలకు మరమ్మతు పూర్తిచేసి కొత్త ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు చేపట్టేందుకు సహకారమందిస్తామని ఆ సంస్థ ముందుకు వచ్చింది. అయితే బల్దియా నుంచి సరైన స్పందన లేకపోవడంతో వెనకడుగు వేసింది. అయితే అప్పుడే సరిగా స్పందిస్తే ఇప్పటికే పునరుద్ధరణ జరిగేదని అధికారులే చెబుతున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చే విద్యార్థులు, సందర్శకులతో నక్షత్రశాల కళకళలాడేది. వీరికోసం స్పెషల్ షోలు వేసిన సందర్భాలున్నాయి.
కొంత మంది కమిషనర్లు నక్షత్రశాల పునరుద్ధరణపై దృష్టిసారించి మధ్యలోనే వదిలేశారు. కాగా, భవనానికి మరమ్మతు చేసిన అధికారులు షో వేసేందుకు కావాల్సిన ప్రొజెక్టర్, సీటింగ్, డ్రోమ్, సౌండ్ సిస్టం ఏర్పాటుకోసం టెండర్లు నిర్వహించడంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ ఈఎన్సీ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే అధికారులు త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడితే పాలక వర్గం గడువు ముగిసేలోపు నక్షత్రశాలలో ప్రదర్శనలు ప్రారంభమయ్యే అవకాశముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.