మహాజాతరకు ఆర్టీసీ సేవలు
21లక్షల మంది భక్తుల చేరవేతే లక్ష్యం
విధుల్లో 12 వేల మంది సిబ్బంది
20 బస్సులతో ఉచిత షటిల్ సర్వీసులు
ఆర్టీసీ ఈడీ మునిశేఖర్
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన
తాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి 3845 సర్వీసులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఈడీ మునిశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే జాత ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం 19 లక్షల మందిని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి చేరవేశామని, ఈసారి 21 లక్షల మంది భక్తులను చేరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సుమారు 12 వేల మంది సిబ్బంది జాతరలో వి ధులు నిర్వర్తిస్తారని, వారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మేడారంతో పాటు తాడ్వా యి, చిన్నబోయినపల్లిలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బస్సులు బస్టాండ్‌కు త్వరగా చే రుకునేందుకు వీఐపీ పార్కింగ్ సమీపంలో ఆర్టీసీ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని తెలిపారు. 51 పాయింట్ల ద్వారా ఆపరేట్ చేస్తామని, 42 క్యూలైన్ల ద్వారా భక్తుల బస్ పాయింట్లకు అనుమతిస్తామన్నారు. టిమ్ మిషన్ల ద్వారా టికెట్లు ఇస్తూ ప్రయాణంలో అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ వాహనాల్లో పస్రా మీదుగా వచ్చే భక్తులను మేడారం చేరవేసేందుకు 20 బస్సులతో షటిల్ ట్రిప్‌లను ఉచితంగా నడిపిస్తామని తెలిపారు. గత జాతరకంటే 300 బస్సులను అదనంగా నడిసిస్తున్నామని, భక్తులకు రవాణాకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆయనవెంట ఆర్ఎం విజయ్‌భాస్కర్, డీవీఎం శ్రీనివాస్, డీఈ బుచ్చయ్య, ఈఈ సత్యనారాయణ తదితరులున్నారు.