భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 21: బాలల సంరక్షణకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ దివాకర్తో కలిసి బాల రక్షక్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బాలలకు నాణ్యమైన ఆహారంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్న పిల్లల రక్షణ నిమిత్తం 1098కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలో చేరుకొని రక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, సీపీవో సామ్యూల్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శిరీష, చైల్డ్ వేల్పేర్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, సీడీపీవోలు అవంతిక, రాదిక, తదితరులు పాల్గొన్నారు.