జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తం
వారానికి మూడు రోజులు వైద్య శిబిరాలు
జ్వర పీడితుల నుంచి శాంపిల్స్ సేకరణ
38మంది మలేరియా బాధితుల గుర్తింపు
పలిమెల మండలంలో అత్యధికంగా 6 మలేరియా కేసులు
96 గ్రామాల్లో 33వేల దోమ తెరల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 19(నమస్తేతెలంగాణ) : అత్యధికంగా అటవీ, మారుమూల గ్రామాలున్న జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, విరేచనాలు, విష జ్వరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఉన్న 13 పీహెచ్సీలు, 2 సీహెచ్ల్లో వారానికి మూడు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నది. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపడంతో పాటు మందులు అందిస్తున్నది. మహాముత్తారం, పలిమెల, మల్హర్రావు, మహదేవపూర్ మండలాల్లోని 96 గ్రామాల్లో పేదలకు 33వేల దోమ తెరలను పంపిణీ చేసింది.
వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం.. ఆపై జిల్లాలో అటవీ ప్రాంతం, మారుమూల గ్రామాలే ఎక్కువ.. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జూన్ నుంచి వర్షాలు పడుతుండడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, విరేచనాలు, విష జ్వరాల కట్టడిపై దృష్టి సారించింది. జిల్లాలోని 13 పీహెచ్సీలు, 2 సీహెచ్లలో వైద్యారోగ్య శాఖ అధికారులు వారానికి మూడు రోజులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు జ్వరం వచ్చిన వారి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 38 మలేరియా కేసులు నమోదు కాగా, బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. డెంగీ కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టిందని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా తయారయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీరు అందిస్తున్నారు. అలాగే ప్రజలకు ఆయా జీపీల కార్యదర్శులు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
దోమ తెరల పంపిణీ…
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జూన్ నుంచే ముందస్తు చర్యలు చేపట్టారు. 13 పీహెచ్సీ, 2 సీహెచ్సీల పరిధిలో వారానికి మూడు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతాలైన మహాముత్తారం, పలిమెల, మల్హర్రావు, మహదేవపూర్ మండలాల్లోని 96 గ్రామాల ప్రజలకు 33 వేల దోమతెరలు పంపిణీ చేశారు.
జ్వర పరీక్షలు..
జిల్లాలోని ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 38 మందికి మలేరియా జ్వరం సోకగా, పలిమెల మండలంలోనే అత్యధికంగా 16 మంది ఈ జ్వరం బారిన పడ్డారు. మెరుగైన వైద్యం ద్వారా వీరందరూ పూర్తిగా కోలుకున్నారు.
90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి..
జిల్లాలో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం 0.5శాతం మాత్రమే కరోనా లక్షణాలు గల కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.
అందుబాటులో మందులు..
జిల్లాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్యానికి అవసరమయ్యే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్థానిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.