రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ములుగుటౌన్/ భూపాలపల్లి రూరల్, జనవరి 12 : ఓటరు జాబితాలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఎపిక్ (ఓటరు) కార్డులను జాతీయ ఓటరు దినోత్సవం రోజున అందజేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా తదితర అంశాలపై బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. జనవరి 5న తుది ఓటరు జాబితా రూపొందించామని, అందులో 18 ఏండ్లు నిండి కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు, కిట్లు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈవీఏం గోదాముల్లోకి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను వారంలోగా తరలించాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. వీసీలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భవేశ్‌మిశ్రా, ములుగు డీఆర్వో రమాదేవి, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎలక్షన్ టెక్నికల్ పర్సన్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.