ములుగు, ఆగస్టు21(నమస్తేతెలంగాణ) : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వంపై పోరాటం ఫలితంగా ములుగు జిల్లాలో ఎట్టకేలకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. 2014 నుంచి 2023 వరకు కేవీ ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడడంతో 2023లో కేవీ మంజూరైంది. అయినప్పటికీ కేంద్ర విద్యాశాఖ అధికారులు ముందుకు రాక ఇంత కాలం ఆలస్యం జరిగింది.
గత ప్రభుత్వ హయంలో ములుగు జిల్లా పరిధిలో పలు స్థలాలను ఎంపిక చేసి వారికి అప్పగించగా, అయినప్పటికీ విద్యాలయం ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడంతో ఆలస్యం జరిగింది. చివరికి ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడంతో ములుగు జిల్లా అధికారులు వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ గ్రామంలోని మోడల్ పా ఠశాలలో కేంద్రీయ విద్యాలయానికి గదులను కేటాయించగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉత్తమ విద్యాబోధన, అత్యుత్తమ బోధనా సౌకర్యాలతో జాతీయస్థాయి విలువలతో ములుగు ప్రాంత విద్యార్థులకు 1వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్ఈ సెలబ స్తో నాణ్యమైన విద్య అందనుది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మహ బూబాబాద్ పా ర్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలు మార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.
దీంతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ బృందం 2023 జూన్ 28న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులను పరిశీలించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన విద్యార్థులకు 5వ ప్రాధాన్యతతో ప్రవేశాలు కల్పిస్తారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ మోడల్ పాఠశాలలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశాం. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తాం. 10వ తేదీన లాటరీ పద్ధతిలో డ్రా తీసి విద్యార్థుల జాబితాను 12వ తేదీన ప్రదర్శిస్తాం. 15 నుంచి 21వ తేది వరకు ప్రవేశాల కేటాయింపుతో పాటు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తాం. త్వరలో పూర్తిస్థాయి క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేయనున్నాం.
– జే సీతారాం, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, ములుగు