భూపాలపల్లి టౌన్/గణపురం, జూలై 7 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి గణపురం మండలకేంద్రంలోని రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనాలు, భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సాగునీరు, ఉచిత కరంట్, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, రైతు బీమా, పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులు పండించిన పంటను కొంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల కల్లాల వద్దకే వెళ్లి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాకముందు 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యేదని.. ఇప్పుడు కోటీ పది లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని, ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. పెద్దాపూర్ గ్రామ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని, తక్షణమే పల్లె ప్రగతి నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన సంక్షేమ శాఖ, మంత్రి దయాకర్, కలెక్టర్ నిధుల నుంచి నిధులు ఇప్పిస్తానని అన్నారు. అలాగే రెండు జిల్లాల మధ్య నలుగుతూ అభివృద్ధికి దూరమవుతున్న 5 గ్రామాలను జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తానన్నారు. గణపురం మండలకేంద్రంలోని చారిత్రక ప్రాంతమైన కోటగుళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరికరాల కొనుగోలుకు, పిల్లర్లకే పరిమితమైన మహిళా సమాఖ్య భవనానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. గణపురం చెరువు నీటిని లిఫ్టు చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా వెంకటాపురం, గణపురం, భూపాలపల్లి మండలాలకు తరలించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గణపసముద్రం కట్టను మరమ్మతు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించి, చెరువులో బోటింగ్, కట్టపై లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ రిజ్వాన్, డీపీవో ఆశాలత, డీఏవో విజయభాస్కర్, జడ్పీ సీఈవో శోభారాణి, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి, సర్పంచ్ మామడి మొండయ్య, ఎంపీటీసీ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మండల అధ్యక్షుడు భార్గవ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం, గణపురం మండల ప్రత్యేకాధికారి కుమారస్వామి, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రామకృష్ట, ఏపీవో రాజయ్య, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నగేశ్ పాల్గొన్నారు.