ప్రజల కదలికలపై పోలీసుల నిఘా.. డ్రోన్ కెమెరాకు చిక్కితే బుక్ అయినట్టే
హన్మకొండ సిటీ, మే 26 : లాక్డౌన్ సమయంలో విచ్చలవిడిగా బయట తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ప్రజలు సాధారణ రోజుల్లో తిరిగినట్టే తిరుగుతూ పోలీసులు ఆపగానే ఏదో ఒక కారణం చెప్తూ వెళ్లిపోతున్నారు. అంతేకాకుండా గల్లీల్లో ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తులతో పాటు, ఇతర కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు కమిషనరేట్ పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం ఇంతెజార్గంజ్ పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో పోచమ్మమైదాన్ సర్కిల్ సమీప గల్లీల్లో ప్రజల కదలికలను గమనించారు. డ్రోన్ కెమెరాను సీపీ కొద్దిసేపు ఆపరేట్ చేసి సమీప పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో వాహనదారులు, ప్రజల కదలికలను పరిశీలించనున్నట్లు చెప్పారు. కెమెరాకు చిక్కిన వాహనదారుడికి ఆన్లైన్లో జరిమానా విధించనున్నట్లు తెలిపారు. సీపీ వెంట డీసీపీ పుష్ప, ఏసీపీ గిరికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై స్వామి, సిబ్బంది ఉన్నారు.