281 గ్రామాల్ల్లో డంపింగ్‌యార్డులు
పల్లె ప్రగతితో చేతినిండా పనులు
జిల్లాలో రూపుమారుతున్న ఠ పంచాయతీలు
జనగామ, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులను ఉపాధి హామీ కూలీలతో చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య సిబ్బం ది కొరత, కొన్నిచోట్ల అసలు కార్మికులే లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే చెత్తాచెదారం పేరుకుపోయేది. తాజాగా ఉపాధిహామీ పథకంలో పారిశుధ్య పనులు చేర్చడంతో సిబ్బంది సరిపోక గ్రామ పంచాయతీలు ప్రతినెలా అదనంగా చెల్లిస్తున్న వేతనాల భారం తగ్గింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించేందుకు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే అనేక పథకాలు, వ్యవస్థాగత పనులు చేపడుతున్న ఫలితంగా గ్రామాలు పరిశుభ్రతను సంతరించుకుంటున్నాయి. జిల్లాలో 281 గ్రామపంచాయతీలుండగా 58,068 కుటుంబాలున్నాయి. ఉపాధిహామీ పథకంలో 94, 271 మంది కూలీలు పనులు చేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు 22 లక్షల 70 వేల పనిదినాలు కల్పించి రూ.48.24 కోట్లు చెల్లించారు. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో రూ.59.99 కోట్లు, 2021-22 సంవత్సరంలో రూ. 25 కోట్లు విడుదల చేసింది. పంచాయతీలకు సంబంధించిన సాధారణ (జనరల్ ఫండ్) నిధుల నుంచి 30 శాతం పారిశుధ్యానికి ఖర్చు చేయాలనే నిబంధనను 50 శాతానికి పెంచారు. దీనికి అనుగుణంగా పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేయడం ద్వారా గ్రామాల నుంచి తడి, పొడి చెత్తతోపాటు నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించడం చేపట్టారు. వాటర్ ట్యాంకర్‌తో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. గతంలో పంచాయతీలకు లభించే ఆదాయంలో సగం నిధులు పారిశుధ్యానికే ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలతో పారిశుధ్య పనులు చేయించడం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో ఉపయోగించడంతో పంచాయతీలు బలోపేతపై ఆర్థిక భారం తగ్గింది.
ఈజీఎస్ నిధులతో పనులు
గ్రామాల్లో చెత్తను ఒకదగ్గరకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకంలో డంపింగ్‌యార్డు నిర్మాణాలకు నిధులు ఖర్చుచేస్తున్నది. పంచాయతీలు సేకరించిన రెండు గుంటల స్థలంలో రెండు మీటర్ల లోతులో 15 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పులో డంపింగ్‌యార్డును నిర్మిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును ఉపాధిహామీ పథకం నుంచి వెచ్చిస్తారు. గ్రామాల్లోని చెత్తను సేకరించేందుకు త్రిచక్ర వాహనాల కోసం రూ.7,152తోపాటు ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తీసుకువెళ్లేందుకు దినసరి కూలీలకు రూ.169 చొప్పున చెల్లిస్తారు. ఆరునెలల పాటు ఉపాధిహామీ పథకం నుంచే గ్రామపంచాయతీల్లోని ఒక్కో డంపింగ్‌యార్డుకు రూ.1,40,426 కేటాయిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లోని పలు వీధుల్లో మురుగు కాల్వల నిర్మాణం లేకపోవడంతో ఇళ్లలోంచి వాడకపు నీరు రోడ్లపైకి వస్తున్నాయి. ఈజీఎస్‌లో భాగంగా ఇళ్లలో నిర్మించుకునే సామాజిక ఇంకుడు గుంతలకు రూ.4,040, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.6 వేలు చెల్లిస్తారు. మరోవైపు ఈజీఎస్‌లో గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం కోసం గ్రామపంచాయతీలు 20 శాతం, మిగిలిన 80 శాతం నిధులు ఈజీఎస్ కింద చెల్లించడంతోపాటు పనులను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా పనిచేసే వారికి మా త్రమే జాబ్‌కార్డులు అందేలా జిల్లాలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనర్హుల జాబ్‌కార్డులు ఏరివేయడంతోపాటు ప నులు పక్కాగా చేపట్టేందుకు ఇది వరకే జియో ట్యాం గింగ్ విధానంలో భువన్ యాప్ ద్వారా వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పుడు కూలీలకు జాబ్‌కార్డు లు కొత్తవి ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
రూ.7.02 కోట్లతో డంపింగ్‌యార్డులు
గ్రామాల్లో చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రతీ పంచాయతీలో డంపింగ్‌యార్డు (చెత్త నిల్వ కేంద్రం) నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించి జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు ఖర్చుచేసే వెసులుబాటు కల్పించింది. గతంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయా రై పల్లెల్లో నిత్యం టన్నులకొద్ది తడి, పొడి చెత్త ఎక్కడిక్కడే పేరుకుపోయేది. మండల కేంద్రాల్లో గ్రామ పొలిమేరల్లో, ప్రధాన రహదారుల పక్కనే పడేసి అక్కడే కాల్చివేసేవారు. పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామాల్లో రూ.7.02 కోట్ల ఖర్చు తో డంపింగ్ యార్డులు నిర్మించడంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ప్రతి పంచాయతీకో పల్లె ప్రకృతి వనం ఉండాలనే తెలంగాణ సర్కారు ఆదేశాలతో జిల్లాలో రూ.24.15 కోట్లతో 483 ఆవాసాల్లో పచ్చటి వనాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరోవైపు త్వరలో బృహత్ పల్లె ప్రకృతి వనాల కింద రూ.4.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈజీఎస్‌లో కూలీలతో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రూ.35.12 కోట్లతో వైకుంఠధామలు సైతం నిర్మించారు.