మత్తడిపడుతున్న చెరువులు, చెక్‌డ్యామ్‌లు
పలు గ్రామాల్లో నీటమునిగిన పంటపొలాలు
జనగామ రూరల్, జూలై 23 : ఎడతెరిపి లేని వర్షాలతో మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు అలుగులు పోస్తున్నాయి. వడ్లకొండలోని ఆనం చెరువు మత్తడి పడుతున్నది. శామీర్‌పేటలోని కుమ్మరి కుంట కట్టకు గండి పడి నీరు వృథాగా పోతున్నది. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ శుక్రవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. గండి పూడ్చడంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల కళింగరాజు, తహసీల్దార్ రవీందర్, సర్పంచ్ మాండ్ర రవికుమార్ పాల్గొన్నారు.
వరదలతో చెక్‌డ్యామ్‌లకు జలకళ
దేవరుప్పుల : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు పోటెత్తండంతో మండలంలోని యశ్వంతాపురం, కోలుకొండ వాగులపై చినమడూరు, చౌడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల, గొల్లపల్లి వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌లు మత్తడిపడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి గంటల వ్యవధిలోనే పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల చెక్‌డ్యామ్ నిండాయి. శుక్రవారం వర్షం తగ్గినా వరద ఉదృతి కొనసాగుతున్నది. రామరాజుపల్లి, దేవరుప్పుల చెరువులు అలుగు పోస్తున్నాయి. సింగరాజుపల్లి, నీర్మాల, కోలుకొండ, చినమడూరు, కడవెండి గ్రామాల్లోని చెరువులకు సగానికంటే ఎక్కువ నీరు చేరింది. నీరు సమృద్ధిగా ఉండడంతో రెండు పంటలు పండుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గంగమ్మ తల్లికి పూజలు
కడవెండి వద్ద చెక్‌డ్యామ్ మత్తడి పడుతుండడంతో స్థానిక మహిళలు గంగమ్మ తల్లికి తెప్పతో వాయినం సమర్పించారు. 2వ వార్డు సభ్యురాలు మునగాల కరుణ, కొత్తకొండ సోమలక్ష్మి గౌరమ్మ తల్లిని అలంకరించి నూతన వస్ర్తాలు గంగకు సమర్పించారు. సంవత్సరంలో వాగు ఆ రు నెలలు ప్రవహిస్తుండడంతో రెండు పంటలు పండుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
చిన్నరామన్చర్ల కుంట గండి పూడ్చివేత
బచ్చన్నపేట : మండలంలోని చిన్నరామన్చర్లలోని పోసాని కుంటకు గండి పడగా శుక్రవారం రెవెన్యూ అధికారులు పూడ్చివేయించారు. తహసీల్దార్ శైలజ, స్థానిక సర్పంచ్ కలీల్బేగం, ఎంపీటీసీ గుర్రాల లలితానర్సిరెడ్డితో కలిసి ఇసుక బస్తాలను తెప్పించారు. రైతులు సైతం ముందుకొచ్చి గండిని పూడ్చారు. సకాలంలో స్పందించిన అధికారులు, రైతులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఏడునూతుల చెరువును పరిశీలించిన హమీద్
కొడకండ్ల : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మండలంలోని ఏడునూతుల పెద్ద చెరువు కట్ట, మత్తడిని శుక్రవారం ఆయన పరిశీలించారు. హమీద్ మాట్లాడుతూ ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు, ఇతరులు చేపలు పట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహ, పంచాయతీ కార్యదర్శి సార య్య, వెంకన్న పాల్గొన్నారు.