ఉపాధి కల్పించేందుకు సర్కారు కృషి
వరంగల్ పోలీస్‌కమిషనర్ తరుణ్‌జోషి
స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాజాబ్‌మేళా
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 2 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. శనివారం శివునిపల్లిలోని సిరిపురం గార్డెన్లో స్టేషన్ ఘన్పూర్ డివిజన్ పరిధిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదివిన 18 నుంచి 35 ఏళ్లలోపున్న నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌జోషి మాట్లాడుతూ యువత తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మత్తు పదార్థాలకు, నేరాలకు దూరంగా ఉండాలన్నారు. స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, రఘునాథపల్లి, లింగాలఘనపురం, గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 1500 మంది నిరుద్యోగులు జాబ్‌మేళాకు వచ్చారని ఆయన తెలిపారు. ఇం దులో హైదరాబాద్‌లోని 47 కంపెనీలతోపాటు, వరంగల్‌కు చెందిన రెండు కంపెనీలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం యువతకు నిర్వహించే పోటీ పరీక్షలో రాణించాలనే ఉద్దేశంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి యువత సిద్ధంగా ఉండాలన్నారు. తమకు అందవచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుని రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి తరుణ్‌జోషి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, జనగామ ఏసీపీ వినోద్‌కుమార్, స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, జనగామ రూరల్ సీఐ వినయ్‌కుమార్, ఆయా మండలాల ఎస్సైలు రమేశ్ నాయక్, శ్రీనివాస్, మహేందర్, రాజేశ్ నాయక్, దేవేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జాబ్ మేళాకు 1031 మంది హాజరు
మెగా జాబ్ మేళాకు 1031 మంది హాజరుకాగా, వీరిలో 673 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారని, వీరిలో 251 మంది ఉత్తీర్ణత సాధించారని స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 107 మంది జాబ్ మేళాలో సెలెక్ట్ కాకపోవడంతో వీరికి టాటా కంపెనీకి సంబంధించిన వారు నెల రోజులు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని ఆయన తెలిపారు.