హనుమకొండ చౌరస్తా, జూలై 4 : వరంగల్‌ను రాష్ట్రంలోనే నంబర్‌వన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే వరంగల్‌లో నిట్, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్‌తో పాటు ఎల్బీ కాలేజీ, ఐటీ పార్కులున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం నిర్వహించిన లాల్ బహుదూర్ (ఎల్బీ) కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి లాల్‌బహుదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ లాల్‌బహుదూర్ శాస్త్రి జై జవాన్.. జైకిసాన్ నినాదాలిచ్చారని గుర్తుచేశారు. ప్రపంచానికి దీటుగా విద్యార్థులు నిలబడేలా కోర్సులు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ క్రైమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎల్బీ కాలేజీ విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ మరో 50 ఏళ్లు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా రాబోయే కాలంలో ఎల్బీ లాంటి అనేక కాలేజీలను స్థాపించి విద్యాబోధన అందిస్తామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీ కాలేజీ ఎంతోమంది విద్యార్థి నాయకులను తయారు చేసిందన్నారు.
కాలేజీ అభివృద్ధికి, నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎల్బీ కాలేజీ చైర్మన్ కే నిరంజన్, సెక్రటరీ, కరస్పాండెంట్ ఈ రాజేందర్‌కుమార్, జాయింట్ సెక్రటరీ రమేశ్, ట్రెజరర్ ఆనంద్‌కుమార్, ప్రిన్సిపాల్ అరుణ, ఎన్సీసీ ఆఫీసర్ సదానందం, పీడీ ప్రభాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.