జనగామ, జూలై 2 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండ డంతో రైతులు పొలం బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో సాగు సందడి మొద లైంది. ఈ ఏడాది మే చివరి వారంలో ముందుగా వచ్చి మురిపించిన రుతుపవనాలతో అన్నదాతలు విత్తనాలు నాటారు. తీరా అవి ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తక నష్టాలు చవి చూశారు. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతన్న వానకాలం సాగుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే దుక్కులు దున్ని..గొర్రు కొట్టి పత్తి అచ్చులు తోలి విత్తనాలు నాటేందుకు సమాయత్తమయ్యారు.
ఈ క్రమంలో పత్తి, వరి, మక్కజొన్న తదితర విత్తనాల కోసం రైతులు పరుగులు పెడుతుండడంతో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వరి విత్తనాల్లో ఎక్కువగా కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్-1271 (సన్నరకం), 1010, 64, జేజీఎల్ (దొడ్డురకం) అందుబాటులో ఉండగా, పత్తిలో టాటాబిగ్ఎక్స్, బాహుబలి, సదానంద్, చంద్రగోల్డ్, రాశి, యూఎస్-6067, ఎల్సీహెచ్-414, సనాతన్, బాక్సర్, సురేఖ గోల్డ్, ఆదిత్య-10 వంటి విత్తనాలు, మక్కజొన్నలో కావేరి, బెయిర్, సింజెంటా రకాలకు డిమాండ్ ఉన్న ట్లు దుకాణాదారులు చెబుతున్నారు. కాగా, ఎరువులు, విత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత, నకిలీ బెడద, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయాలపై అధికార యంత్రాంగం టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
కూలీల కొరతను అధిగమించి యంత్రాలతో వ్యవసాయ పనులకు మొగ్గు చూపుతున్న రైతుల కు పెరిగిన డీజిల్ ధరలతో ట్రాక్టర్లు, ట్రిల్లర్లు, వరి కోత యంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్లు, పురుగు మందులు పిచికారీ చేసే తైవాన్ పవర్ స్ప్రేయర్ల నిర్వాహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నా యి. ఎకరానికి రూ.750 ఉన్న ట్రాక్టర్ కిరాయి రూ.850 కాగా, వరి వేస్తే సుమారు రూ. 25,300 పెట్టుబడి అవుతుండగా దిగుబడి మాత్రం ఎకరానికి 30 బస్తాలు పండి రూ.40 వేలు చేతికి వస్తున్నాయి. ఆరు నెలలకు కేవలం రూ.15 వేలతో రైతు సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
జనగామ జిల్లాలో వాన కాలంలో అన్ని పంటలు కలుపుకొని 3.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, ప్రధానంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి, 1.25 లక్షల ఎకరాల్లో పత్తి, మక్కజొన్న 3,670, కందులు 3,500, పెసర్లు 700, వేరుశనగ 100 ఎకరాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు కేవలం 5 ఎకరాల్లో అదీ కూడా బావులు, బోర్ల ఆధారంగా వరి సాగు చేయగా, 35 వేల ఎకరాల్లో పత్తి, 500 ఎకరాలకే మక్కజొన్న పంట సాగుకు పరిమితమైంది.
తొలకరి తర్వాత వానలు ముఖం చాటేయడంతో విత్తనాలు నాటిన రైతులు మొక్కలను కాపాడుకునేందుకు బోర్లు, వ్యవసాయ బావుల ఆధారంగా నీటిని మోటర్, పైపుల ద్వారా స్ప్రింకర్లతో కొంతమేరకు నీటిని అందించగా, మొలకెత్తిన కొన్ని మొక్కలకు సరైన రీతిలో నీరందక ఎండిపోయాయి. దున్నకాలు, విత్తనాలు, అచ్చుతోలడం వంటి వాటికి రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.15వేల పెట్టుబడి పెట్టారు. జనగామ జిల్లాలో ప్ర స్తుతం భూగర్భ జలాలు 10 మీటర్ల లోతుకు పడిపోగా 80శాతంకు పైగా బోర్లు ఎండిపోయాయి. ప్రస్తుతం రైతులు వర్షాలపైనే ఆధారపడ్డారు.
రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని పూర్తిస్థా యిలో వర్షాలు కురిస్తేనే విత్తనాలు నాటుకోవాలని, వరి, పత్తి సాగుకు జూలై మూడో వారం వర కు సమయం ఉన్న దృష్ట్యా రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని వ్యవసాయశాఖ అధికా రులు చెబుతున్నారు. జిల్లాలో వరి విత్తనాలు 44,012 క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 5.80 లక్షలు అందుబాటులో ఉన్నాయి. యూరియా 26,086 మెట్రిక్ టన్నులు, డీఏపీ 5,386 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1,783 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 10,599 మెట్రిక్ టన్నులు, పొటాష్ 3,529 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉంచారు.