గణపురం, నవంబర్ 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులను కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఏలు) బలవంతంగా రప్పించినట్లు తెలిసింది. పలువురు మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. చీరెలు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే వస్తున్నారని, మీటింగ్కు తప్పకుండా రావాలని, లేనిపక్షంలో చీరలు ఇవ్వబోమని, పేర్లు లిస్టులో ఉండవని కొందరు సీఏలు మహిళలకు ఫోన్ చేసి బెదిరించారు.
దీంతో రోజువారీ కూలీ పనులపై ఆధారపడిన తాము పనులు మానుకొని రావాల్సి వచ్చిందని, చీరె విలువ ఎంతుంటుందో కాని, ప్రతి మహిళ సుమారు రూ. 400 నుంచి రూ. 500 వరకు కూలీ నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు స్వచ్ఛందంగా జరగాలే తప్ప, బెదిరించడం, బలవంతం చేయడం సరికాదని మహిళలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆకలితో అలమటించిన మహిళలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన చీరెల పంపిణీ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలైంది. దీంతో ఉదయం నుంచి వేచి ఉన్న మహిళలు ఆకలితో అలమటించారు. ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, సమయపాలన లేకపోవడంపై మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.