హనుమకొండ, జనవరి 20: పీఏసీఎస్‌లలో అవినీతి పేరుతో డీసీవోలు కక్ష సాధిస్తున్నారని, ధాన్యం కొనుగోలు బాధ్యతలను అడ్డుకుంటారని డీసీసీ బ్యాంకు డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్రావు అధ్యక్షతన మహాజన సభ జరిగింది. కొందరు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పీఏసీఎస్‌లలో అవినీతి పేరుతో విచారణ చేసి రద్దు చేసేందుకు కుట్రలు పన్నతున్నారని చైర్మన్లు ఆరోపించారు. ఇలా చేస్తే తాము ఎంత వరకైనా పోయేందుకు సిద్ధమని హెచ్చరించారు. అధికారులు సొసైటీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రూ. 2100 కోట్ల టర్నోవర్
రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, తమ పాలక వర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరి సహకారంతో రూ. 885 కోట్ల నుంచి రూ. 2100 కోట్ల టర్నోవర్‌కు చేరిందని మార్నేని రవీందర్రావు అన్నారు. సహకార మిత్ర -2 డిపా జిట్ పథకాన్ని ప్రారంభించారు. 19 నుంచి 32 బ్యాంకు శాఖలకు విస్తరించామని, త్వరలో మండలానికి ఒకటి చొప్పున మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆర్బీఐ అనుమతి కోసం పంపించామన్నారు.
ఇతర బ్యాంకులకు దీటుగా రుణాల అందజే స్తున్నామని, డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో సీఈవో వజీర్ సుల్తాన్, బ్యాంక్ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు సంపెల్లి నర్సింగరావు, కంది శ్రీనివాస్ రెడ్డి, కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కకిరాల హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్, గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, దొంగల రమేశ్, నాయిని రంజిత్, మాడుగుల రమేశ్, ఎర్రబెల్లి గోపాలరావు, పోలి పాక శ్రీనివాస్, కే నరేందర్, ఎలుగం రవి రాజా, సంజీవ రెడ్డి, ఏ జగన్మోహన్రావు, డీజీఎం అశోక్, నాబార్డ్ డీడీ ఏం చంద్రశేఖర్, మార్ఫెడ్ చైర్మన్ రంగారావు పాల్గొన్నారు.