మహబూబాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నూనెలు సలసల కాగుతున్నాయి. కూరగాయల ధరలు కుతకుత ఉడుకుతున్నాయి. కొబ్బరికాయలు, కోడిగుడ్ల ధరలు.. ఇలా నిత్యావసరాల ధరలు రోజుకొకటి చొప్పున పెరుగుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ధరలను అదుపులో పెట్టాల్సిన అధికారులకు పేద, మద్యతరగతి కుటుంబాల బాధ పట్టడం లేదు. పాలకులు ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫల మయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజాగా వంట నూనె ధరలు పెరగడంతో సామాన్య ప్రజల వంటింట్లో మంట అంటుకుంది. పొయ్యిమీద కాగాల్సిన వంట నూనె కొనక ముందే కాలుతున్నది. పామాయిల్ లీటర్ ప్యాకెట్ ధర గతంలో రూ.100లు ఉండగా ఇప్పుడు రూ.105లకు చేరింది. గోల్డ్డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్కు రూ.142 నుంచి ప్రస్తుతం రూ.147లకు పైగాచేరింది. ప్రీడమ్ ప్యాకెట్ ధర ఒకటి రూ.143లు ఉండగా రూ.148కి చేరింది. శుభం పామాయిల్ ధర గతంలో ఒక ప్యాకెట్లో 800 మిల్లీగ్రాములకు రూ.110 ఉండగా, తాజాగా 700గ్రాములకు తగ్గించి రూ.105లు చేశారు.
పల్లి నూనె ధరలు లీటర్కు రూ.2నుంచి రూ.3లు పెరిగాయి. 5 లీటర్ల వంట నూనె క్యాన్పై రూ.15ల నుంచి రూ.25ల వరకు పెరిగింది. 15 లీటర్ల నూనె క్యాన్పై 40ల నుంచి రూ.60ల వరకు పెరిగింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో మోయలేని భారం పడుతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిత్యావసరాల ధరల పెరుగుదలను అదుపు చేయాలని కోరుతున్నారు.