జనగామ చౌరస్తా, అక్టోబర్ 4 : ‘హలో.. నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నా.. మీరు అధిక మొత్తంలో అసెట్స్ కలిగి ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. రైడ్ చేయడానికి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. వెంటనే ఈ నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపండి.. నేను మా బాస్‌తో మాట్లాడి రైడ్ ఆపిస్తా’ అంటూ జనగామ జిల్లా అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల కలెక్టరేట్లో ఆర్అండ్బీ ఈఈ హుస్సేన్‌తో పాటు ఏటీవో రవీందర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటనను ఆసరాగా చేసుకున్న ఓ సైబర్ కేటుగాడు బీసీ సంక్షేమాధికారి బీ రవీందర్‌తో పాటు ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) జితేందర్‌రెడ్డికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు వారు శుక్రవారం వెల్లడించారు.
వారు తెలిపిన ప్రకారం.. గురువారం ఉద యం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య సెల్ నంబర్ 8464953615 నుంచి ఏసీబీ ఇన్స్పెక్టర్ను అంటూ స్పష్టమైన తెలుగులో ఓ సైబర్ కేటుగాడు ఇద్దరు అధికారులతో వేర్వేరుగా మాట్లాడాడు. ఏసీబీ అధికారులై తే చెప్పకుండానే రైడ్ చేస్తారు.. పైగా డబ్బు లు డిమాండ్ చేయరు.. ఏ రైడ్‌కైనా సిద్ధమే అని వారు చెప్పడంతో ‘నేను చెప్పేది మీకు అర్థమైతలేదా’ అని బెదిరిస్తూ ఫోన్ కట్ చేశాడు. అధికారులిద్దరివి ఐ ఫో న్లు కావడంతో కాల్‌ను రికార్డు చేయలేకపోయారు.
ఆఫీస్ సిబ్బంది ఫోన్ ద్వారా ట్రూ కాలర్‌లో నంబర్‌ను సెర్చ్ చేస్తే ‘డీవీ రత్నం’ అని చూపెడుతున్నదని అధికారులు పేర్కొన్నారు. కాగా, గత నెల 23న సహకారశాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కుమార్‌కు కూడా 9160802941 (ట్రూ కాలర్‌లో మిస్ రోహిణి ఏసీబీ ఆఫీస్ రాంగ్) నంబర్ నుంచి రెండుసార్లు ఇలాగే ఫోన్ వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య దృష్టికి తీసుకెళ్లగా ఫేక్ కాల్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. దీంతో బాధిత అధికారులు సైబర్ నేరగాడిపై జనగామ అర్బన్ పీఎస్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.