Donation | అరుదైన రక్త సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఓ చిన్నారికి కేసముద్రం మండలం కలవల గ్రామ వాసి బొగ్గుల రాజేష్, హేమలత అనే దంపతులు 292 మంది నుంచి రూ.3.15 లక్షలు సేకరించారు. అలా సేకరించిన మొత్తం సొమ్ము శనివారం కలవల గ్రామంలో మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి చేతుల మీదుగా అందించారు. మహబూబాబాద్ పట్టణ కేంద్ర వాసి గార వినోద్ కుమార్, విజయ దంపతుల కుమార్తె విస్తృత ప్రియాన్షీ రక్త సంబంధ వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబానికి చెందిన విజయ్ కుమార్ తన కుమార్తె వైద్యానికి డబ్బులు లేకపోవడంతో అయోమయ స్థితిలో ఉన్నాడు.
తన కుమార్తె వైద్య ఖర్చులకోసం దాతలు సహకరించాలని కోరుతూ వినోద్ కుమార్ వీడియో తీసి కురవి మండల వాసి రఘు అనే వ్యక్తి సహాయంతో సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న బొగ్గుల రాజేష్, హేమలత దంపతులు.. విజయ్ కుమార్ సామాజిక మాధ్యమాలలో తన కుమార్తెను ఆదుకోవాలని చేసిన పోస్టును చూసి చలించిపోయారు. చిన్నారిని ఎలాగైనా ఆదుకోవాలని దృఢ సంకల్పంతో ఈ విషయాన్ని తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులకు, బంధువులకు తెలియపరచి సహకారం కోరారు.
అలా 291 మంది నుంచి సేకరించిన రూ.3.15 లక్షలు చిన్నారి కుటుంబ సభ్యులకు అందించేందుకు శనివారం కలవల గ్రామంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి రూ.5000 అందించాడు. మొత్తం రూ.3.20 లక్షలను చిన్నారి కుటుంబ సభ్యులకు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు లింగాల పిచ్చయ్య, మోడం రవీందర్ గౌడ్, గంటా బాలకృష్ణారెడ్డి, గండి శ్రీనివాస్, బొగ్గుల నాగయ్య, కుదురుపాక ఉపేందర్, పోడేటి దినేష్ తదితరులు ఉన్నారు.