ములుగు రూరల్, నవంబర్ 5 : కాకతీయులు నడయాడిన ములుగు జిల్లాలోని బరిగలానిపల్లి గ్రామంలోని వరాల గుట్టపై కలప స్మగ్లర్ల కన్ను పడింది. వందల సంఖ్యలో ఉన్న టేకు చెట్లను రాత్రికి రాత్రే యంత్రాలతో కోసి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈ తతంగమంతా అటవీ శాఖ అధికారుల అండదండలతోనే జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. కంచే చేను మేసిన చందంగా ఏడాదిన్నర క్రితం ఇదే గుట్టపై ఉన్న 70 నుంచి 80 టేకు చెట్లను నరికిన ఘటనలో అప్పుడు బీట్ ఆఫీసర్‌గా పనిచేసిన సీహెచ్ నర్సింహారావు హస్తం ఉన్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఈ సమయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గుట్టపై టేకు చెట్లను లెక్కించగా సుమారు 1015 ఉన్నట్లు గుర్తించారు. అందులో 500 వరకు దుంగ సైజు చెట్లు ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, ప్రస్తుతం స్మగ్లింగ్ దందా మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా గుట్టపై టేకు చెట్ల నరికి వేత జోరుగా సాగుతున్నది. అక్కడ విధులు నిర్వర్తించే బీట్ ఆఫీసర్ సహాయంతో స్మగ్లర్లు 130 చెట్లను నరికినట్లు సమాచారం. అటవీ సంపదను, వన్య ప్రాణులను కాపాడాల్సిన అధికారులే ఆ శాఖకు మచ్చ తీసుకువచ్చేలా అడవి ధ్వంసానికి పాల్పడుతున్నారు. విలువైన టేకు సంపద గుట్టపై ఉన్నప్పటికీ దానిని కాపాడడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అధికారుల అండదండలతో స్మగర్లు టేకు దుంగలను నరికి రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులెవరు? ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు? అనేది తెలియరావడం లేదు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
వరాల గుట్టపై టేకు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. గుట్టపై 130 వరకు చెట్లను నరికివేశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ రోజు సిబ్బందితో వెళ్లి నరికిన చెట్లను గుర్తిస్తాం. కలప స్మగ్లింగ్‌లో అటవీ శాఖ అధికారుల ప్రమేయం ఉంటే ఉపేక్షించేది లేదు. దీనిపై విచారణ జరిపిస్తాం. విషయం తెలిసిన వెంటనే సాయంత్రం బరిగలానిపల్లి గ్రామానికి సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశాం. కార్పెంటర్ షణ్ముఖచారి వద్ద 10 టేకు సైజులను గుర్తించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కలపను స్వాధీనం చేసుకున్నాం. దూగడ మిషన్‌ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించాం. షణ్ముఖచారిపై కేసు నమోదు చేశాం. తనిఖీ చేస్తున్న క్రమంలో గ్రామంలోని కొంతమంది మా విధులకు ఆటంకం కలిగించి గొడవకు దిగారు. అటవీ సంపదను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– డోలి శంకర్, ఎఫ్ఆర్వో, ములుగు