వరంగల్, మే 12 : జన గణనలో భాగంగా తొలి విడతలో చేపట్టిన ఇండ్ల గణన గందరగోళంగా మారింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న సర్వే ఎన్యుమనేటర్లకు సవాల్‌గా మారింది. డిజిటల్ మ్యాపింగ్ ఇచ్చాం.. ఇళ్లు వెతుక్కోండి అంటూ అధికారులు చెబుతుండటంతో గ్రేటర్ వరంగల్‌లో వారు చుక్కలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి అమలుచేస్తున్న డిజిటల్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ మ్యాపింగ్‌లో గృహ గణన చేయాల్సిన ప్రాంతం బౌండరీ మాత్రమే ఇచ్చి నార్త్ నుంచి సర్వే మొదలు పెట్టాలని అధికారులు ఆదేశించారు.
అయితే మ్యాపింగ్‌లో ఇంటి నంబర్లు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తున్నదని ఎన్యుమరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సర్వేలు చేసిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు సైతం ప్రస్తుత గృహ గణన ఇబ్బందిగా మారింది. డిజిటల్ మ్యాపింగ్‌లో గూగుల్ లోకేషన్ ఆధారంగా ఎన్యుమరేటర్లు సర్వే చేసే గృహాలను వెతుక్కోవాల్సి వస్తున్నది. ఇందులో అనేక లోపాలున్నాయని, సర్వే చేసే ప్రాంతం ఒకటైతే లోకషన్ మరోచోట చూపిస్తున్నదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో టెక్నికల్ సిబ్బందిని నియమించాల్సిన గృహ గణన శాఖ అధికారులు దానిని పట్టించుకోకపోవడంతో బల్దియా అధికారులు, సూపర్ వైజర్లకు ఏం చేయాలో తెలియడం లేదు.
దిక్కులు గుర్తించడానికే రెండు రోజులు
డిజిటల్ మ్యాపింగ్‌తో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్యుమరేటర్లు దిక్కులు గుర్తించేందుకే రెండు రోజులు గడిచిందని అంటున్నారు.డిజిటల్ మ్యాప్‌లో నార్త్ నుంచి గృహ గణన మొదలు పెట్టాలని అధికారులు ఆదేశించడంతో ముందుగా దిక్కులు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత నార్త్ నుంచి ఇళ్లను గుర్తించి నంబర్లు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. గృహ గణన ప్రారంభించి రెండు రోజులైనా ఇప్పటి వరకు ఇళ్ల లెక్కింపు మొదలు పెట్టలేదంటున్నారు. డిజిటల్ మ్యాపింగ్ ప్రకారం అసలు ఎన్ని ఇండ్లు ఇచ్చారన్నది అధికారులకే తెలియడం లేదు. లోకేషన్ ఆధారంగా నంబర్లు వేస్తేగాని ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుస్తుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. ఎక్కువ ఇండ్లుంటే మరో ఎన్యుమరేటర్‌ను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో ఎన్యుమరేటర్‌కు 200 వరకు ఇండ్లు..
గృహ గణనలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 200 ఇళ్లు కేటాయించారు. గతంలో సర్వే చేయాల్సిన ఇంటి నంబర్లను అందించేవారు. ప్రస్తుతం డిజిటల్ మ్యాపింగ్‌లో కేవలం సర్వే చేయాల్సిన బౌండరీ మాత్రమే ఇచ్చారు. లోకేషన్ ఆధారంగా బౌండరీ లోపల ఉన్న ఇళ్లను సర్వే చేయాలని అధికారులు చెప్పడంతో తొలుత ఇళ్లను వెతుక్కొని నంబర్లు వేసుకొని, ఆ తర్వాత గృహ గణన చేయాల్సి వస్తున్నదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. గుర్తించిన ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలు తప్ప మిగతా 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని చెబుతున్నారు. ఇంటిలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయనే దానితో పాటు ఇంట్లో సౌకర్యాలకు సంబందించిన సమాచారం తెలుసుకుంటున్నారు. వాహనాలు, ఇంటర్నెట్, మరుగుదొడ్లు, నల్లానీరు తాగుతున్నారా? బోరు నీరు వాడుతున్నారా? బావి నీరు వాడుతున్నారా? మరుగుదొడ్డి ఇంటి అవరణలో ఉందా? ఇంటికి దూరంగా ఉందా? అనే వివరాలు సేకరిస్తున్నారు.