మహదేవపూర్(కాళేశ్వరం), జూలై 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువన మహారాష్ర్టాలో కురుస్తున్న భారీ వర్షాలతో బరాజ్‌కు ప్రవాహం పెరుగుతున్నది. బుధవారం బరాజ్ ఇన్‌ఫ్లో 2,41,530 క్యూసెక్కులు ఉండగా, గురువారం 6,36,130 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రవాహం రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 95.10 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు.
బరాజ్‌లోని అన్ని గేట్లు ఎత్తడంతో భారీ స్థాయిలో వరద దిగువకు విడుదలవుతుండగా లోతట్టు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం భారీగా పెరిగింది. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నది. భారీ వరద కారణంగా సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఇటీవల పుష్కర ఘాట్ వద్ద మెట్ల మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతులు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.