వరంగల్ చౌరస్తా, జూన్ 27: జాతీయ వైద్య మండలి ఆదేశాలతో వై ద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు కళాశాల పరిధిలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సర్వే సంగీత ఆధ్వర్యంలో కేఎంసీకి చేరుకున్న బృంద సభ్యులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహాశబరీష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగ తం పలికారు. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ మో హన్దాస్, కళాశాల పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్లు, పలు విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. దవాఖానల్లో అవసరాలు, సౌకర్యాలు, వసతులు, నిధుల కేటాయింపు, మంజూరు వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
అనంతరం కళాశాల ఆవరణలోని ‘ప్రధానమంత్రి స్వస్థ్ సంరక్షణ యోజన’ (పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఓపీ, ఐపీ వివరాలతోపాటు నెలల వారీగా నమోదవుతున్న గర్భిణుల వివరాల్లో మార్పు లు, రిఫరల్స్ వివరాలతోపాటు సాధారణ ప్రసవాల సూచికలను పరిశీలించారు. అనంతరం ఛాతి, క్షయ వ్యాధి నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు, బాధితులకు అందుతున్న పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంజీఎంహెచ్కు చేరుకున్న బృందం ఓపీ రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించారు. ఓపీ ఫార్మసీలో రికార్డుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూపర్వైజర్ వేణు అందించిన సమాధానానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఎంజీఎంహెచ్‌లో రోగులు, వైద్యులు, వైద్య విద్యా ర్థులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను డైటీషియన్ రవీందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ కిశీర్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యవిద్యార్థుల డైట్‌కి బయోమెట్రిక్ అమలు చేయాలని, సాధ్యం కాకపో తే పాత పద్ధతిని అమలు చేయాలన్నారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని నవజాత శిశువుల వార్డును పరిశీలించారు. రికార్డు నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఎంజీఎంహెచ్ నుంచి సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ చేరుకున్న తనిఖీల బృందం సభ్యులు ముందుగా ఓపీ రిజిస్ట్రేషన్, లేబర్ రూం (కాన్పుల గది), ఆపరేషన్ థియేటర్లతోపాటుగా నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ల పనితీరు, రికార్డుల నమోదు తీరును పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సాంబశివరావు, అప్పయ్య, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ ప్రసాద్, కేఎంసీ ఏడీ రమేశ్, ప్రసాద్, ప్రసూతి వైద్యశాల హనుమకొండ సూపరింటెండెంట్ రాజేశ్వరి, సీకేఎం వైద్యశాల సూపరింటెండెంట్ షర్మిల, టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.