కరీమాబాద్, అక్టోబర్ 23 : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్సు గుట్ట వద్ద ఆదివారం నరకాసుర వధను ఘనంగా నిర్వహించారు. ఉర్సు రంగలీలా మైదానంలో నరకాసుర వధ కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. 55 అడుగుల భారీ నరకాసుర విగ్రహానికి అమర్చిన పటాకుల శబ్దాలతో మైదానం మార్మోగగా, ఆకాశంలో తారాజువ్వలు మిరుమిట్లు గొలుపుతూ అబ్బురపరిచాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఉర్సు కురుమవాడలో నుంచి శ్రీకృష్ణ-సత్యభామ వేషధారణలో కళాకారులను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మైదానానికి తీసుకొచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, భధ్రకాళీ పూజారి శేషు, కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్ధం రాజు, పోశాల పద్మ, గుండు చందన, ఉమ, సువర్ణ, నరకాసుర వధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.