భీమదేవరపల్లి, జనవరి 17 : కోరమీసాల కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం భక్తజనం పోటెత్తింది. ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చాలని కోరమీసాలు సమర్పించారు. తమ గండాలు తొలగిపోవాలని గండ దీపం వద్ద నూనె పోశారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి కోడె మొక్కలు చెల్లించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్‌రావు, ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, భూక్యా తులస్య, మఠం శ్రీశైలం, ముల్కనూరు ఏకేవీఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, పోలీసులు భక్తులకు సేవలందించారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో సర్కస్, రంగుల రాట్నం, జాతరలో వెలసిన దుకాణాలు సందడిగా మారాయి.
నాగవెల్లి, వసంతోత్సవం
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయంలో నాగవెల్లి, వసంతోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలకు వసంత మండపంలో నీలలోహిత పూజ నిర్వహించారు. నల్లపూసలను భద్రకాళి అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం ఊయల ఊపి సప్తవర్ణాల ఏకాంత సేవ నిర్వహించారు. ఏకాంత సేవలో తేజోరూపుడై ఉన్న స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కనుల పండువగా త్రిశూల స్నానం
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం త్రిశూల స్నానం కార్యక్రమం కనులపండువగా జరిగింది. గణపతి పూజ, గవ్యాంతం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మహాకుంభాభిషేకం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకురాగా, జడ్పీటీసీ వంగ రవి, ఆలయ చైర్మన్ కుమారస్వామి, ఈవో కిషన్‌రావు, రాజయ్య, వీరభద్రయ్య, ధర్మకర్తలు కలశాలను ఎత్తుకున్నారు. ఏపీలోని శ్రీశైలం దేవస్థానానికి చెందిన వీరశైవులు మంగళవాయిద్యాల మధ్య వీరభద్ర పల్లెరం చేశారు. వీరశైవులు విన్యాసాలు చేస్తుండగా ఉత్సవమూర్తులను, త్రిశూల కలశాలను పవిత్ర కోనేరుకు తీసుకెళ్లి స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులు కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించారు.
నేడు అగ్నిగుండాలు, స్వామివారి గ్రామ పర్యటన
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. శరభ శరభ అంటూ భక్తులు నిప్పు కణికలపై భక్తిపారవశ్యంతో నడువనున్నారు. అదే రోజు సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటన ఉంటుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్, ఈవో తెలిపారు.