హనుమకొండ, డిసెంబర్ 16 : వేలాది మంది భక్తుల దత్తనామస్మరణ, సామూహిక అనఘాష్టమి వ్రతంతో ఓరుగల్లు ఆధ్యాతిక శోభను సంతరించుకున్నది. శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచే గాక దేశ నలుమూలల నుంచి భక్తజ నం తరలివచ్చి ఎంతో శక్తి గల వత్రాన్ని ఆచరించి.. తరించింది. మార్గశిర మాసం కృష్ణ పక్షం అష్టమి రోజున జగద్గురువుల సన్నిధిలో అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రం నిర్వహించిన ప్రధాన అనఘాష్టమి వ్రతంలో పది వేల జంటలు పాల్గొన్నాయి. వ్రత కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రౌండ్‌కు విచ్చేసిన స్వామీజీకి తెలంగాణ సంప్రదాయంతో బతుకమ్మలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామికి చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ దంపతులు, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్‌రావు, పలువురు అధికారు లు స్వాగతం పలికారు.
అనఘాదేవి-అనఘాస్వామి అష్టసిద్ధులతో కూడిన వ్రతాన్ని ఆచరిస్తే మన కు, మన కుటుంబానికి, ప్రపంచానికి శాంతి చేకూర్చుతుందని, ఈ వ్ర తాన్ని ఓరుగల్లులో నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావించి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అద్భుతమైన వేదికపై మొట్టమొదటిసారి 10 వేల జంటలతో అనఘాష్టమి వ్రతాన్ని ప్రపంచంలోనే మొదటిసారి ఓరుగల్లులో నిర్వహించారు. జగద్గురు సచ్చిదానంద స్వామి సంకల్పంతో సుమారు రెండు గంటలపాటు పూజ కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. కాగా మూడు పెద్ద వేదికలు ఒక్కోదాంట్లో పది వేల మందికి ఏర్పాట్లు చేశారు. వేదిక ప్రాంగణంలో అన్ని దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వేదికపైన భద్రకాళి అమ్మవారు, రుద్రేశ్వరస్వామి, బతుకమ్మలను ఏర్పాటు చేశా రు. పలువురు ప్రముఖులు, అధికారులు, పోలీస్ సిబ్బంది సేవలందించారు. సాయం త్రం దాదాపు ఐదు వేల మందితో భగవద్గీత పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు నెక్కొండ కవితా కిషన్, ఏనుగుల మానసా రాంప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వ్రతంతో శక్తి, యోగ్యత
ప్రపంచ క్షేమం కోసమే పది వేల మందితో సామూహిక అనఘాష్టమి వ్రతం నిర్వహించాం. ఈ వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిని ఆచరించడం వల్ల సమాజంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి, పాపాలను హరించే శక్తి, యోగ్యత వస్తుంది. కుల మతాలకు అతీతంగా అందరూ చేయవచ్చు. నేడు ప్రపంచంలో అశాంతి, అల్లకల్లోలం నెలకొందని ముఖ్యంగా కరోనా, ఇతరత్రా భయంకరమైన వ్యాధులు భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఎంతో శక్తి గల అనఘాష్టమి వ్రతాన్ని ప్రతి ఒకరూ భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. తెలంగాణ చేసుకున్న పుణ్యఫలితంగా ఈ వ్రతాన్ని వరంగల్ కేంద్రంగా నిర్వహించామని, ఇక్కడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు. భక్తిపీఠం నుంచి శక్తి వస్తుందని, ఈ శక్తి మన విజయానికి దోహదపడుతుంది. నమ్మకం, మంచి మనసుతో వ్రతం చేస్తే అన్ని సుఖాలు కలుగుతాయి. భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.
– దత్త పీఠాధిపతి సద్గురు గణపతి సచ్చిదానందస్వామి
బ్రహ్మాండంగా నిర్వహించారు.. అభినందనలు : దాస్యం
హనుమకొండలో ప్రధాన అయుత అనఘాష్టమి వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. భక్తుల వేల సంఖ్యలో వ్రతంలో పాల్గొని జగద్గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహం పొందారు. మైసూరు దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, విజయానంద తీర్థ రాకతో నగరం మొత్తం ఒకసారిగా ఆధ్యాత్మికత సంతరించుకుంది. వ్రతాన్ని చాలా గొప్పగా ఎలాంటి ఆటంకాల్లేకుండా నిర్వహించిన నిర్వాహకులు, అధికారులకు అభినందనలు.