నల్లగొండ ప్రతినిధి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణంలోని ఐటీ హబ్ వెనకాల ఉన్న అర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాల్లో మొత్తం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కట్టే కార్యక్రమాన్ని చేపడతారు. తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
మొత్తం పోలైన 24,139 ఓట్లను ఒకే రౌండ్లో లెక్కించనున్నారు. ప్రధానంగా యూటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూటీఎస్ నుంచి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సరోత్తంరెడ్డి, టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా వీరితో పాటు మరో 13 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పేపర్లన్నింటినీ 25 చొప్పున కట్టలు కట్టిన అనంతరం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు 40 కట్టల చొప్పున మొత్తం వెయ్యి ఓట్లను ఒక రౌండ్లో కౌంటింగ్ చేస్తారు. ఇలా ఒకే రౌండ్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అయితే ఈ లెక్కింపునకు కనీసం 4 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యాహ్నం 3 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయితే ఆ తర్వాత గెలుపు కోటా నిర్ధారణ జరుగుతుంది.
చెల్లని ఓట్లను తీసేసి, చెల్లిన ఓట్ల నుంచి 50 శాతం ప్లస్ ఒకటి కలిపి గెలుపు కోటాను ఖరారు చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తూ ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఒక్కో టేబుల్‌పై 8 బ్యాలెట్ బాక్స్‌ల చొప్పున మొత్తం 200 బాక్స్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కడతారు. ఆ తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది.
అసలు అంచనాలు మాత్రం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే మొదలుకానున్నాయి. ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు కోటాపై స్పష్టత రానిపక్షంలో ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఎవరికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే లెక్కింపును నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.