శాయంపేట, మే 7 : గ్రామ పరిపాలనకు కేంద్రమైన పంచాయతీ కార్యాలయంలో ఒకప్పుడు ఇరుకు గదులే ఉండేవి. వార్డు సభ్యులు, సర్పంచ్, కార్యదర్శులకూ అవస్థలు తప్పేవి కావు. మండలంలోని ప్రగతిసింగారం జీపీ కార్యాలయం ఎన్నో ఏండ్లుగా చిన్నపాటి ఇరుకు ఇంటిలో కొనసాగింది. ఇందులో కేవలం రెండు గదులు మాత్రమే ఉండేవి. దీంతో సమావేశాల నిర్వహణకు ఇబ్బంది అయ్యేది. కార్యాలయంలోకి ప్రజలు వస్తే సరిపోయే పరిస్థితి ఉండేది కాదు. సమావేశాలైతే కొందరు బయటనే ఉండాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రగతిసింగారం గ్రామ సచివాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. దీనికి జిల్లాలోనే రెండో మోడల్ జీపీ కార్యాలయంగా గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.55లక్షలతో దీన్ని నిర్మించారు. భవనం కింది భాగంలో ఐదు గదులు, పై భాగంలో సమావేశాల నిర్వహణ కోసం హాల్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్, కార్యదర్శులకు ప్రత్యేక గదులు, కంప్యూటర్ గది, స్టోర్ రూమ్, ఈజీఎస్‌కు ప్రత్యేక గదిని కేటాయించారు. ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లను నిర్మించడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. పంచాయతీ భవనానికి 2020, ఆగస్టు 14న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. కాగా, ఆధునిక హంగులతో గ్రామ సచివాలయాన్ని నిర్మించడం, సౌకర్యవంతంగా పాలన సాగుతుండడంతో ప్రజల్లోను హర్షం వ్యక్తమవుతోంది.