బచ్చన్నపేట, అక్టోబర్6: మండలంలోని కొన్నె గ్రామంలో అన్నాచెల్లెను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్యల కుమారుడు మహేశ్‌కుమార్, కుమార్తె మౌనిక ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.
ఎస్జీటీలో మహేశ్ 5వ ర్యాంకు, మౌనిక 15వ ర్యాంకు సాధించి గ్రామానికే వన్నె తెచ్చారు. వీరి తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా, తల్లి కష్టపడి బీడీలు చుట్టి ఉన్నత చదువులు చదివించింది. అన్నాచెల్లె ఉపాధ్యాయులుగా ఎంపిక కానుండడంతో వారి తల్లి ఆనందం వ్యక్తం చేయగా, గ్రామస్తులు అభినందించారు.