వరంగల్ : దేశ చరిత్రలోనే మొదటిసారిగా భారీస్థాయిలో 80,039 ఉద్యోగ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.
అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తేదీ నుంచి 90 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పలు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో, హన్మకొండ హంటర్ రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో రెండు ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2700మంది విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్ డెవలప్మెంట్ తరగతులతో పాటు సుమారు 2వేల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.