పాలకుర్తి, జూన్ 2: జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆది నుంచి వివాదాస్పదంగానే మారుతున్నది. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో అధికారుల నిర్లక్ష్యంతో శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరు ఉండడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సాక్షిగా అధికారులు ప్రొటోకాల్ తప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డా.. పింగిలి శ్రీపాల్రెడ్డ్డా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసినా అధికారులు శిలాఫలకంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరు పెట్టడంపై ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ప్రైవేట్ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు విగ్రహదాత అంటూ ఎలా పేరు పెడుతారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.