స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 9 : బీఆర్ఎస్ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే విషయమై నాలుగు వారాల్లోగా స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సుమోటోగా తీసుకొని మళ్లీ విచారిస్తామని తీర్పు వెల్లడించిన హైకోర్టు జడ్జికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్దంగా, రాజకీయాలకు అతీతంగా నడుచుకుంటానని గతంలో చెప్పిన స్పీకర్ తన మాటపై నిలబడాలన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంపై గెలిచిన కడియం తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ రవి, మాజీ సర్పంచ్ సురేశ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, గుర్రం శంకర్, ఎం దేవయ్య, తాటికొండ అనిల్, ఒగ్గు రాజు, చిట్టిబాబు, గాదె రాజు, జీ మల్లేశ్, ఎం ప్రసాద్, అశోక్, ప్రవీణ్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.