పాలకుర్తి, అక్టోబర్ 26 : సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తున్నదని, ప్రశ్నించే గొంతుకలపై పగ సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథో డ్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ పది నెలల్లో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, సీఎం పదవి అంటే తిట్టడమే పనిగా ఉందన్నారు. రాష్ట్రంలో పోలీస్స్టేషన్లు అంటే కాంగ్రెస్ కార్యాలయాలుగా పని చేస్తున్నాయని, ఇది తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాడని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. పాలకుర్తి, తొర్రూరు ప్రాంతాలు నీళ్లు లేక ఎండిపోయాయన్నారు.
గోదావరి జలాలతో కరువు నేలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథు డు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నాయకత్వంలో పాలకుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో శ్రీను నాయక్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. శ్రీను నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. శ్రీను నాయక్ మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకుడిపై హత్య కేసు నమోదు చేసి పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని సిరికొండ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిది అసమర్థ పాలన అని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. రాష్ర్టానికి హోంమంత్రి లేడని, పాలనలో మార్పు రాలేదు కానీ.. మరణాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెతగాటమాడుతున్నదన్నారు. మైనర్ బాలికపై సాక్షాత్తు ఓ సీఐ లైంగిక వేధింపులకు పాల్పడితే జిల్లాలోని మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని, సీఐపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు.
గిరిజన యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటే జిల్లాలో ఉన్న గిరిజన మంత్రి ఏం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు రాలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 30సార్లు ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు. శ్రీను మృతికి కారణమైన రాజకీయ నాయకుడిని శిక్షించాలన్నారు. శ్రీను కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థి ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే బీఆర్ఎస్ మంత్రి వర్గం అండగా నిలిచిందని గుర్తు చేశారు. జీవో 29ని వెంటనే రద్దు చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని, కమీషన్రెడ్డి అని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. అతడిది రాక్షస పాలన అని మండిపడ్డారు. మూసీ పేరుతో సీఎం రేవంత్ రూ. 1.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. డబ్బు మూటలను రాహుల్‌గాంధీకి పంపుతున్నాడని విమర్శించారు.
సీఎం రేవంత్ పాలన గాలికి వదిలేసి కమీషన్ల కోసం ఆరాటపడుతున్నాడన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, 420 హామీలతో మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి విలాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీను నాయక్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ, పోలీసుల హత్యేనన్నారు. శ్రీను నాయక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
-మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ
పోలీస్‌స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీను నాయక్ది మూమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పది నెలల నుంచి పాల కుర్తి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా రాష్ర్టానికి హోం, విద్య, గిరిజనశాఖలకు మంత్రులు లేరని, మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదని, రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతున్నదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ మంత్రులు, నాయకులు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు ఏ తప్పు చేయలేదని, కాళేశ్వరం, ఫోన్ ట్యాంపింగ్ వంటి కేసులకు భయపడేది లేదని, ఈడీలు.. బోడీలు లేవని.. ఏ తప్పు చేసినా శిక్షించుకోవచ్చని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ మంత్రులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. గిరిజన యువకుడు శ్రీనునాయక్‌కు మద్దతు తెలిపినందుకే కొన్ని డిజిటల్ పత్రికల్లో తనపై తప్పుడు రాతలు రాయిస్తున్నారని.. తనకేం కాదన్నారు. రేవంత్‌రెడ్డి హయాంలో పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని, రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదన్నారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడని.. ఆయన హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, గ్రామాలను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని.. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటా.. ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటున్నా.. ఏ ఆపద వచ్చినా గద్ద లెక్క వాలుతా.. అండగా ఉంటానని దయాకర్‌రావు అన్నారు.
శ్రీను నాయక్ మరణ వాంగ్మూలంలో తన చావుకు ఎస్సై, సీఐ, కాంగ్రెస్ నాయకులే కారణమని చెప్పినా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే శ్రీను నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటూ ఆదుకుంటానని చెప్పారు. పాలకుర్తి నియోజక వర్గంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ముందుంటానన్నారు. పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని, కాంగ్రెస్‌కు తొత్తులుగా పని చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పాలనలో పోలీసులకు అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసుల భార్యలే ధర్నాలు చేస్తున్నారన్నారు.
-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
లకావత్ శ్రీను ఆత్మహత్యకు నిరసనగా శనివారం ఎల్‌హెచ్‌పీఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు, నియోజకవర్గ గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత సిరికొండ మధుసూదనాచారి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, తాటికొండ రాజయ్య కొండాపురం శివారు మేకలతండాలో లకావత్ శ్రీను చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.
అక్కడి నుంచి నేరుగా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో పాల్గొన్నారు. ఆనంతరం వందలాది మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కేసు పురోగతిపై చర్చలు జరిపారు. శ్రీను మృతికి కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. జనగామ డీసీపీ రాజ మహేంద్రనాయక్, వర్ధన్నపేట, జనగామ ఏసీపీలు అంబటి నర్సయ్య, పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ధరావత్ మోహన్ గాంధీనాయక్, జర్పుల బాలునాయక్, గుగులోతు రాజేశ్‌నాయక్, బానోత్ మహేందర్‌నాయక్, ధరావత్ రాంసింగ్ నాయక్, కాలునాయక్, ధరావత్ యాకూబ్‌నాయక్, ధరావత్ జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, నల్లా నాగిరెడ్డి, పుస్కూరి శ్రీనివాసరావు, పసునూరి నవీన్, తీగల దయాకర్, వసుమర్తి సీతారాములు, పేరం రాము, సిందె రామోజీ, బస్వ మల్లేశం, మంగళంపల్లి శ్రీనివాస్, రంగుకుమార్, జినుగు అనిమిరెడ్డి, పాము శ్రీనివాస్, మాచర్ల ఎల్లయ్య, ఈదూరు ఐలయ్య, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, వీరమళ్ల రాజు శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.