అటవీ ఉత్పత్తులతో అడవి బిడ్డలకు ఉపాధి కలుగుతున్నది. ముష్టి గింజల సేకరణ వారికి కల్పత రువుగా మారింది. వీటిని వివిధ ఔషధాల తయారీలో వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే ముష్టి గింజలను ఈ నెల, వచ్చే నెలలోనే ఎక్కువగా సేకరిస్తారు. వాటిని ఏరి, ఎండబెట్టి గిరిజన సహకార సంస్థకు విక్రయిస్తారు. ఇందుకోసం జీసీసీ డివిజన్ పరిధిలోని బ్రాంచి మేనేజర్లకు రూ.63 లక్షలు అడ్వాన్స్‌గా కేటాయించింది. గ్రామస్థాయిలో కొనుగోళ్లకు సేల్స్మెన్లను నియ మించింది. ప్రస్తుతం కేజీకి రూ. 45 చొప్పున ఇస్తుండగా, ధర కూడా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
గిరిజన సహకార సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణ గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో ప్రమాదకరమైన ముష్టిగింజలను వివిధ రకాల ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఔషధాల తయారీలో వినియోగిస్తుండగా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు బట్టి అటవీ ఉత్పత్తులు విరివిగా లభిస్తుంటాయి. గతేడాది ఏటూరునాగారం జీసీసీ డివిజన్ పరిధిలో 150 క్వింటాళ్ల వరకు ముష్టి గింజలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ గింజలను టెండరు ద్వారా విక్రయిస్తుంటారు. గత ఏడాది ఒడిశాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే వీటి సేకరణకు జీసీసీ ఏర్పాటు చేసిన సేల్స్ డిపోల ద్వారా కొనుగోలు చేసి ఆయా బ్రాంచిల పరిధిలో ఉన్న గోదాంలకు పంపిస్తారు. అక్కడ నుంచి డివిజన్, రాష్ట్ర స్థాయి గోదాంలకు వెళ్లిన తర్వాత వచ్చిన మొత్తాన్ని బట్టి ఉన్నతాధికారులు టెండర్లు నిర్వహిస్తారు.అయితే ఈసారి జీసీసీ దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది. నెల రోజుల క్రితం జీసీసీ జనరల్ మేనేజర్ ఏటూరునాగారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముష్టి గింజల సేకరణ ఎక్కువగా చేపట్టేందుకు అధికారులు, ఉద్యోగులు క్షేత్రస్థాయి లో పర్యటించి సేకరణదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతో ఆయా బ్రాంచి మేనేజ ర్లు, సేల్స్మెన్లు అటవీ ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఏటూరునాగారం జీసీసీ డివిజన్ పరిధిలో కనీసం 300 క్వింటాళ్ల ముష్టిగింజల సేకరణ చేప ట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డివిజన్ పరిధిలో సుమారు 2392 మంది గిరిజనులు ఏటా అటవీ ఉత్పత్తుల సేకరణలో పాల్గొంటారు. ప్రస్తుతం కేజీకి రూ. 45 చొప్పున సేకరణ జరుగుతోంది. అయితే వీటి ధర కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే ముష్టిగింజల సేకరణ ఈ నెల, వచ్చే నెలలోనే ఎక్కువగా జరుగు తుంది. చెట్ల నుంచి కింద రాలిన ముష్టి కాయలను ముందుగా సేకరిస్తారు. వాటిని పగులగొట్టి గింజలను తీసి ఎండబెడుతారు. తర్వాత వాటిని విక్రయిస్తారు. కొందరైతే చెట్లపైకి ఎక్కి పండుగా మారిన కాయలను రాల్చుకుంటారు. వాటిని ఏరుకోవడం, గింజలను ఎండబెట్టడం చేస్తుంటారు. వీటిని మార్కెట్లో ఇతరులు ఎవరూ కొనే అవకాశం లేనందున జీసీసీ మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఆదాయం కల్పించే ముష్టిగింజల చెట్లను నరకడం చేయరు. చెట్లు ఏపుగా ఉండడంతో ఎక్కువ కాయలు లభించే అవకాశాలు ఉన్నాయి. అడవిలో ఉండే ఈ చెట్ల వద్దకు తరచూ వారు వెళ్తున్నందున నేరుగా వాటి వద్దకే వెళ్లి సేకరిస్తారు. ఇవి విషపూరితమైన గింజలు కావడం వల్ల వీటి పట్ల సేకరణదారులు జాగ్రత్తలు తీసు కుంటారు. ఇండ్లల్లో నిల్వ చేసుకోవడం, చిన్న పిల్లలకు దూరంగా ఉంచడం చేస్తుంటారు.
ముష్టి గింజల కొనుగోలు కోసం డివిజన్ పరిధిలోని బ్రాంచి మేనేజర్లకు రూ. 63 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాం. గతేడాది 150 క్వింటాళ్ల వరకు సేకరించాం. ఈసారి మరింత పెంచడానికి ముందస్తుగా ప్రణాళిక చేశాం. సమావేశాలు ఏర్పాటు చేయడం, సేకరణ దారులకు అవగాహన కల్పించడం లాంటివి చేస్తున్నాం. ఏటూరునాగారం బ్రాంచికి రూ. 15లక్షలు, వెంకటాపురానికి రూ. 8లక్షలు, ములుగుకు రూ. 10లక్షలు, నర్సంపేటకు రూ. 10లక్షలు, మహదేవపూర్‌కు రూ. 10లక్షలు, మన్ననూరు బ్రాంచికి రూ. 10లక్షల చొప్పున అడ్వాన్సు ఇచ్చాం. ఈనెల నుంచి సేకరణ ప్రారంభమవుతుంది. కొనుగోలు చేసిన విత్తనాలను సంస్థ టెండరు నిర్వహిస్తుంది. ఎక్కువగా ఇతర రాష్ర్టాలకు చెందిన ఔషధాల కంపెనీలు టెండర్ల ద్వారా వీటిని పొందుతాయి. బ్రాంచి పరిధిలోని సేల్స్డిపోల ద్వారా వీటిని సేకరిస్తున్నాం.