కేసముద్రం : పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి రైతులకు భరోసా అందించాలని కోరుతు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు నిర్వహించి తహశీల్దార్ వివేక్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో చర్చించినప్పటికి రైతులకు ప్రయోజనం కలుగలేదన్నారు. సర్వే చేసి నెలలు గడుస్తున్నప్పటికి అధికారులకు నేటికి రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించలేదని అన్నారు. సర్వే ద్వారా 1633 ఎకరాలు సాగులో ఉన్నట్లు గుర్తించి 633 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇవ్వడం బాధాకరమన్నారు.
పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులు రైతు భరోసాకు, రైతు బీమాకు, రుణ మాఫీ, మద్దతు ధరలకు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, మిర్యాల యాకుబ్ రెడ్డి, కొయ్యగూరి రాంరెడ్డి, జాటోత్ వెంకన్న, బానోత్ బాష, గుగులోత్ లక్పతి, బానోత్ శంకర్, ధరంసోతు శ్రీను, జాటోత్ రమేష్, భీమా, వెంకన్న తదితరులు ఉన్నారు.