వాజేడు, ఆగస్టు23: రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాజేడులోని ఏపీజీవీబీకి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాతలు రావడంతో బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి క్యూలో విడుతల వారీగా లోపలికి అనుమతించడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజూ రుణమాఫీకి సంబంధించి ఆర్వోఆర్1బీ పత్రాలు, పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతాబుక్ జిరాక్స్లు ఇచ్చి వెళ్తున్నారు.
మళ్లీ వారానికి ఖాతాలో నగదు జమయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నాలుగైదు సార్లు బ్యాంకుకు రావాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంకుకు రోజూ వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్డుకు ఇరువైపులా నిలిపిన వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు స్పందించి రైతులకు త్వరగా రుణమాఫీ చేయాలని స్థానికులు, వాహనదారులు సైతం కోరుతున్నారు.
నర్సింహులపేట, ఆగస్టు 23: బ్యాంకులో తీసుకున్న లోన్ మాఫీ అయిందని బ్యాంకుకు నా కొడుకుతో పొద్దున వచ్చిన. ఇక్కడ శానామంది ఉన్నరని లైన్ల నిల్సున్న. బ్యాంకోళ్లు అచ్చి తలుపు(షటర్) తీయంగనే అందరు ఒకల మీద ఒకలు పడ్డట్టు ఉరికిన్రు. గప్పుడు నా నెత్తి ఇసుప కడ్డీకి(గ్రిల్)కు తాకింది. రక్తం కారుతున్నా ఎవరూ పట్టించుకోలే. ఏం చేయాల్నో తెల్వలే. పైసలు సంగతేందో కాని కొద్దిగైతే నా పాణం పోతుండె.
– మంద సోమక్క, రైతు, రామన్నగూడెం