జనగామ, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2014 నుంచి 2023 వరకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసి వెంటనే కొత్త రుణాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం జనగామ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది.
జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఆందోళనలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా విడుదల చేయాలన్నారు. చిన్న చిన్న సాకులు చూపుతూ రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా ఎంతమందికి రుణమాఫీ కాలేదో తెలుసుకునేందుకు కలెక్టర్ గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లాలో 2022 మార్చి, ఏప్రిల్ మాసాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం రూ.10 వేలు విడుదల చేయాలని రైతుసంఘం డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంగ వీరయ్య, సహాయ కార్యదర్శి రమావత్ మీట్యా నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేశ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తోటి దేవదానం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా సురేశ్‌నాయక్, సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కాసాని పుల్లయ్య, రైతులు కర్రె రాములు, కర్రె బీరయ్య, వెంకటేశ్, రాజ్‌కుమార్, అపరాదపు రాజు పాల్గొన్నారు.