చెన్నారావుపేట, జనవరి 8 :బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో చెన్నారావుపేట మండలానికి చెందిన గొల్లపల్లి, పదహారుచింతల తండా, మాలోత్‌తండా, నక్కలగుట్ట తండాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది యూత్ సభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియమాలకు కట్టుబడి విధేయత, నమ్మకంతో పార్టీ, ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కార్యక్తలు పార్టీకి వెన్నెముక లాంటి అని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కేసీఆర్ సర్కారుతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి తండాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్క అశోక్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్‌లు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నర్సంపేట : పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటకు చెందిన నాగబోయిన రవీందర్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3.7 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.