కాకతీయ కళాతోరణం రాచరికం కాదని.. అది ఓరుగల్లు రాజసం అని.. తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదు.. విరమించుకునే వరకూ నిరసనలు ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. కాకతీయ కళాతోరణం తొలగించాలనే రాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నక్కలగుట్టలోని కాళోజీ జంక్షన్ వేదికగా టార్చ్ సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వద్దంటూ నినాదాలు చేశారు.
వెయ్యేళ్ల సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యమైన కాకతీయ చరిత్రను చెరిపేస్తామంటే సహించబోమని దాస్యం హెచ్చరించారు. కాకతీయ కళాతోరణం రాచరికానికి గుర్తు అన్న సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని, తమకు కేసులు కొత్తేమీ కాదని, కేసులకు అదరం, అరెస్టులకు బెదరమని, పోరాట మార్గం విడిచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ నిర్ణయంగా భావించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోని, చరిత్రపై అవగాహన లేని వ్యక్తి తెలంగాణ, ఓరుగల్లు చరిత్రను చెరిపివేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర గుర్తులను తొలగిస్తుంటే వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటు అని, కొండా సురేఖ, సీతక స్పందించాలని దాస్యం కోరారు. కాకతీయులు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేశారని, టెంపుల్స్, ట్యాంక్స్, టౌన్స్ విధానంతో జనరంజక పాలన అందించారన్నారు. ఈ లోగో ఉంటే కేసీఆర్ ప్రజల మదిలో ఉంటారనే పిచ్చి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకొనే సమయంలో తామంతా వ్యతిరేకిస్తే చరిత్రకారులతో చర్చిస్తాం.. సబ్ కమిటీ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు. నిజమైన కాంగ్రెస్‌వాదులు రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు తుగ్లక్ పాలనను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ కళాతోరణం తొలగింపుపై పునరాలోచించాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. నాటి కాకతీయుల సామ్రాజ్య చరిత్ర, వారి విశిష్టతను గుర్తించే కళాతోరణాన్ని కేసీఆర్ రాజముద్రలో ఉంచారని, రాణీరుద్రమ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారన్నారు. కాకతీయుల చరిత్రను చెరిపేస్తే చెరిగిపోదన్నారు. కాళోజీ ధికార స్వరాన్ని చూపిస్తామన్నారు. సీఎం పునరాలోచించక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, రంజిత్‌రావు, సంకు నర్సింగ్, ఇమ్మడి రాజు లోహిత, రాజునాయక్, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, జనార్దన్‌గౌడ్, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్, బీఆర్ఎస్వీ నాయకులు గండ్రకోట రాకేశ్‌యాదవ్, పబ్బోజు శ్రీకాంత్ చారి, టార్చ్ సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ ఆర్య పాల్గొన్నారు.
గణపురం, మే 31: ఓరుగల్లు కీర్తిని చాటేది కాకతీయ కళాతోరణం. ఎంతో చారిత్రక గుర్తింపు ఉన్న దీన్ని తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి తొలగించడానికి సర్కారు ప్రయత్నం చేస్తోంది. మరోసారి పునరాలోచించి కళాతోరణాన్ని యథావిధిగా ఉంచాలి. ఆ చిహ్నాన్ని తొలగించి ఉమ్మడి వరంగల్ ఔన్నత్యాన్ని కించపరిచే ప్రయత్నం చేయొద్దు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ప్రభుత్వం రాజముద్రను రూపొందించి ఆ చిహ్నంలో చార్మినార్‌తో పాటు కాకతీయ కళాతోరణాన్ని చేర్చింది. ఈ కళాతోరణం కాకతీయుల సుపరిపాలనకు గుర్తుగా భావిస్తుంటారు. పదేళ్లుగా ఇదే రాజముద్ర కొనసాగింది. కళాతోరణం తొలగింపును ప్రతి ఓరుగల్లు బిడ్డ వ్యతిరేకించాలి. ఈ మేరకు సీఎంవో కార్యాలయానికి మెయిల్ కూడా పెట్టాం.