ఇనుగుర్తి, ఆగస్టు 27 : ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవరంగారావు సేవలు మరువలేనివని ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఒద్దిరాజు సుభాష్, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒద్దిరాజు సోదరులు తొలి తెనుగు పత్రికను నెలకొల్పి 102 ఏళ్లు కావడంతో మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ఒద్దిరాజు సోదరులు కవులుగా, రచయితలుగా, బహుభాషా కోవిదులుగా తెనుగు పత్రికను స్థాపించి రాష్ట్రంలో ఖ్యాతి గడించారని, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై పెట్టేందుకు తనవంతు కృషిచేస్తానన్నారు. ఉత్సవాలు ఇనుగుర్తికే పరిమితం కాకుండా హైదరాబాద్ వేదికగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.
సుభాష్ మాట్లాడుతూ గొప్ప మేధావులైన ఒద్దిరాజు సోదరుల పేర్లను మహబూబాబాద్ జిల్లాకు పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాటు చేసిన మూడు ఆహ్వాన ద్వారాల్లో ఒకటి ఒద్దిరాజు సోదరుల పేరిట ఉందని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇనుగుర్తికి వచ్చినప్పుడు ఒద్దిరాజు సోదరుల వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారంటే వారు ఎంత గొప్పవారో అర్థమైందన్నారు. మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి మాట్లాడుతూ ఒద్దిరాజు సోదరులు తమ గ్రామంలో తెనుగు పత్రికను స్థాపించడం గర్వంగా ఉందన్నారు.
జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు బండి సంపత్, వేల్పుల రాజమల్లు, పరకాల రవీందర్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి షీల్డులు బహూకరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక కళామండలి వరంగల్ కార్యదర్శి వనం లక్ష్మీకాంతరావు, రచయిత మద్దెర్ల రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్, ఒద్దిరాజు ట్రస్ట్ సభ్యులు ఒద్దిరాజు సుభాష్, రాంబాబు, సీతారామచందర్‌రావు, వేణుగోపాల్‌రావు, వినయ్‌బాబు, అనిల్‌కుమార్, సతీశ్, చంద్రప్రకాశ్, కల్యాణ్‌లతో పాటు ప్రముఖులు వద్దిరాజు వెంకన్న పాల్గొన్నారు.