డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో మరిపెడ జనసంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, జెండాలతో పట్టణమంతా గులాబీ వర్ణం పులుముకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం రెండు గంటల ముందే ర్యాలీగా చేరుకోవడంతో సభా ప్రాంగణం నిండిపోయింది.
కళాకారులు ఏపూరి సోమన్న, యూట్యూబ్ స్టార్ జానులిరీ ఆటాపాట సభికులను ఊర్రూతలూగించింది. ‘రెడ్యాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనకు మంచి హోదా కల్పిస్తా’నని కేసీఆర్ చెప్పిన సమయంలో కేరింతలు, చప్పట్లుతో ఆవరణంతా మార్మోగింది. ఈ సందర్భంగా ‘కారు రావాలి.. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి’ నినాదాలతో హోరెత్తగా, అంచనాకు మించి సభ విజయవంతమైంది.
నర్సింహులపేట/కురవి/దంతాలపల్లి/మరిపెడ, నవంబర్ 21 : మరిపెడలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. నియోజకవర్గంలోని మరిపెడ, కురవి, డోర్నకల్, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు, సీరోలు మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. గులాబీ జెండాల రెపరెపలతో, దేశ్‌కీ నేత.. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో ఖమ్మం-వరంగల్ రహదారి గులాబీ వనం కాగా, పట్టణమంతా హోరెత్తింది. సభ 3:30 గంటలకు ఉండగా ఒంటి గంట నుంచే ప్రజలతో సభ ప్రాంగణం నిండిపోయింది. సీఎం కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వచ్చిన జనం చేసిన కేరింతలు ఒకవైపు..
సభలో కళాకారుల ఆటాపాటలతో మహిళలు, యువకులు నృత్యాలు కట్టిపడేశాయి. ‘గులాబీ జెండలే రామక.. గుర్తుల గుర్తుంచుకో రామక్క’ పాటలతో సభ ఆవరణంతా మార్మోగింది. ఏపూరి సోమన్న, జానులిరీ పాటకు పదం కలుపుతూ కళాకారులతో పాటు స్టేజ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, యువ నేత డీఎస్ రవిచంద్ర స్టెప్పులు వేసి ఉత్సాహం నింపగా, జనం ఈలలు, కేరింతలతో ఉర్రూతలూగింది.
మహిళలు, యువకులు జెండాలు ఊపుతూ.. సభాప్రాంగణంలో కూర్చున్న కుర్చీలపై నిలబడి నృత్యం చేశారు. ఏపూరి కళాబృందం పాటలతో దుమ్మురేపింది. ఇక ముఖ్యమంతి కేసీఆర్ వేదికపైగా చేరుకోగానే కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎం అంటూ చప్పట్లు కొడుతూ అంతా స్వాగతం పలికారు. రైతుబంధు కావాలంటే రెడ్యాను గెలిపించాలని, 24గంటల కరెంట కావాలా వద్దా అని కేసీఆర్ అడిగినప్పుడు కావాలంటూ ప్రజలు నినదించారు. 3గంటల కరెంట్ కావాలా? 24గంటల కరెంట్ అందించే బీఆర్ఎస్ కావాలా? అని అడుగగా ప్రజలు బీఆర్ఎస్ కావాలని కారు గుర్తుకు ఓటేస్తామని ఉత్సాహంగా బదులిచ్చారు.
కాంగ్రెస్‌వాళ్లు ధరణిని తీసేసి భూమాత తెస్తామంటున్నారని అది భూమాత కాదు భూమేత అని విమర్శించినప్పుడు సభికులు హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు తెలిపారు. రెడ్యానాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే తప్పక అభివృద్ధి జరుగుతుందని, ఆయన మంచి పదవిలో ఉంటారని కేసీఆర్ చెప్పడంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఇలా మరిపెడలో జరిగిన డోర్నకల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ అంచనాకు మించి విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది.