ఏటూరునాగారం, ఆగస్టు 31 : మోతాదుకు మించి స్లైన్లలో హైడోస్ యాంటీబయోటిక్ ఇంజెక్షన్లను రోగులకు ఇస్తున్న విషయం మండలకేంద్రంలోని అపోలో వైద్యశాలలో శనివారం వెలుగు చూసింది. డీఎంహెచ్వో అప్పయ్య శనివారం అపోల్లో, తేజ చిన్న పిల్లల వైద్యశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి రాజ నర్సింహా ఆదేశాల మేరకు ప్రైవేట్ వైద్యశాలలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అపోలో వైద్యశాలలో ఐదుగురు రో గులకు స్లైన్ ఇవ్వగా అక్కడ ఉన్న నర్సును డ్రగ్ వివరాలు తెలుసుకోగా 100 ఎంఎల్ ఎన్ఎస్లో సిఫాఫెరజోన్ అనే హైయ్యర్ యాంటీ బయోటిక్ ఇస్తున్నట్లు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దశల వారీగా కాకుండా ఒకేసారి నేరుగా హైడోస్ ఇవ్వడం వల్ల రోగి నిరోధక శక్తిని తగ్గించినట్లు అవుతుందన్నారు. ల్యాబ్ టెస్టుల ధరల పట్టిన లేకపోవడంపై దవాఖానకు మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. వైద్యశాల అనుమతి పత్రాలను పరిశీలించారు. అనంతరం మండలకేంద్రలోని ఎస్సీ కాలనీలో డ్రై డే నిర్వహించి దోమల నివారణపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. రొయ్యూరు సబ్ సెంటర్ను సందర్శించి స్థితి గతులను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట రొయ్యూరు మెడికల్ ఆఫీసర్ సుమలత ఉన్నారు.