జనగామ చౌరస్తా, మే 9 : ఇంజినీరింగ్ డిప్లొమా, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 13న నిర్వహించే పాలీ సెట్ 2025కు సర్వం సిద్ధం చేసినట్లు శుక్రవారం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏ నర్సయ్య తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్ష సమయాని కన్నా ఒక నిమిషం ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించరని సూచించారు. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 1416 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనగామ ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్ లో 576 మంది, సెయింట్ మేరీస్ హైస్కూల్ 480 మంది విద్యార్థులతో పాటు స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 360 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్ టికెట్ తో పాటు హెచ్ బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో మాత్రమే పరీక్షా కేంద్రం లోపలికి రావాలన్నారు.