పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 17 : పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా అందజేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని గుర్తుచేశారు.
ప్రజలు నమ్మకంతో గెలిపించనప్పుడు, ఆ నమ్మకం నిలబెట్టుకునేలా మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ పోటీపడి అభివృద్ధి చెందాలన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందజేయాలన్నారు. అధికారులతో పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వం కారణంగానే నేడు బీఆర్ఎస్ అంతటా బలమైన శక్తిగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా మీ పాలన ఉండాలని సూచించారు.
ఇంద్రేశంలో మంగళవారం గెలిచిన కొత్త కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. అనంతరం ఇంద్రేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్నారు. ఎమ్మెల్యేగా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం చైర్పర్సన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీశ్రెడ్డిలు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.