హనుమకొండ, జూన్ 23 : రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భూముల మార్కెట్ విలువ పెంపుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ డీఐజీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో డీఐజీ ఎం సుభాషిణి ఆదివారం హనుమకొండ రామకృష్ణకాలనీలోని డీఐజీ ఆఫీసులో భేటీ అయ్యారు. మార్కెట్ విలువ పెంపుపై సమీక్షించారు. ప్రస్తుత విలువ, మార్కెట్ విలువలపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రొఫార్మా ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 198 ప్రాతిపదికన భూమి మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్లను నిర్ధారించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి 29న మార్కెట్ వ్యాల్యూ కమిటీకి డ్రాప్ట్ అప్రూవల్కు పంపించాలన్నారు. కమిటీ ఆమోదించిన తర్వాత జూలై ఒకటవ తేదీలోగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలను పొందుపరుస్తారు. 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అభ్యంతరాలు వస్తే పరిష్కరిస్తారు. ఒక వేల ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే వాటిని ఫైనల్ చేసి జూలై 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు అధికారులు తెలిపారు.