హనుమకొండ సిటీ, డిసెంబర్ 14 : ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు, టీసీ బుక్కుల జారీలో డబ్బు వసూలు ఆరోపణలపై హనుమకొండ డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో ఎం.డి అబ్దుల్ హై గురువారం తెలిపారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రెన్యువల్ కోసం శ్రీవాణి డబ్బులు డిమాండ్ చేసినట్లు డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ పని కోసం మొదట కొంత మొత్తాన్ని ఓ ఫోన్ నంబరుకు డిజిటల్ పేమెంట్ చేయగా, మిగిలిన కొద్ది మొత్తం కోసం శ్రీవాణి ఫోన్లో ప్రైవేట్ స్కూలు నిర్వాహకుడిని అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే జరిగిన లావాదేవీలు, ఫోన్లో మాట్లాడిన రికార్డులతో డీఈవోకు ఫిర్యాదు చేశారు. మరోవైపు డీఈవో ఆఫీసులో పనుల కోసం వచ్చే వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని శ్రీవాణిపై కలెక్టర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదులు అందాయి. గూగుల్ పే, ఫోన్ పే రూపంలో రూ.10వేలు, రూ.15 వేల చొప్పున పలువురి నుంచి లావాదేవీలు జరిగినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. లావాదేవీల స్క్రీన్ షాట్లను కలెక్టర్‌కు ఇచ్చారు. డీఈవో ఆఫీసులో డబ్బుల వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులపై హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. విద్యా శాఖ ఆఫీసులో ఏం జరుగుతున్నదని డీఈవోను ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఆరోపణలు లేకుండా పరిపాలన కొనసాగాలని ఆదేశించారు.
సీనియర్ అసిస్టెంట్ శ్రీవాణిపై వచ్చిన ఫిర్యాదు విషయాలను డీఈవోకు పంపించారు. అనంతరం డీఈవో ప్రాథమికంగా విచారణ చేశారు. టీసీ బుక్కులకు పైసల వసూలుకు సంబంధించి శ్రీవాణిపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదులు వచ్చాయని డీఈవో నిర్ధారించారు. ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది పలుసార్లు హెచ్చరించినా పునరావృతమమైందని డీఈవో విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ అంశాల ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ శ్రీవాణిపై వచ్చిన ఫిర్యాదులు, లావాదేవీలకు సంబంధించి స్క్రీన్ షాట్లను, విచారణలోని అంశాలను ఆర్జేడీకి పంపించారు. అన్నింటినీ పరిశీలించిన ఆర్జేడీ కే సత్యనారాయణరెడ్డి గురువారం శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో నివేదిక మేరకే శ్రీవాణిపై చర్యలు తీసుకున్నట్లు ఆర్జేడీ తెలిపారు. గెజిటెడ్ స్థాయి అధికారితో సమగ్ర విచారణ చేపడుతామన్నారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు అందిస్తుంది. నామమాత్రపు రుసుముతో ఈ బుక్కులను ప్రభుత్వం ఇస్తుంది. వంద సర్టిఫికెట్ల కాపీలు ఉండే బుక్కు ధర రూ.500 చొప్పున ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లకు ఈ బుక్కుల జారీలో శ్రీవాణి అధికంగా వసూలు చేస్తున్నారని డీఈవోకు ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టరుకు నేరుగా, డీఈవోకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆర్జేడీ సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు.
డీఈవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీవాణిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఆర్జేడీ ఆఫీసుకు నివేదించాం. శ్రీవాణిని సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడి నుంచి సీల్డ్ కవరు వచ్చింది. దీన్ని ఆమెకు పంపించాం.