గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు. జ్ఞానాన్ని పంచే పుస్తక భాండాగారాలు. మేధావులను తయారు చేసే నిలయాలు. ఒకప్పుడు ఇవి ఒక వెలుగు వెలిగినా, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితో కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అద్భుత గ్రంథాలయం రూపుదిద్దుకున్నది. ఆ గ్రామ పూర్వ విద్యార్థులు కొందరు కలిసి 2014లో ప్రజాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
కొందరి ఆలోచనతో మొదలైన ఈ గ్రంథాలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఇప్పుడు ముల్కనూరు ప్రజాగ్రంథాలయంగా ప్రసిద్ధికెక్కింది. నేడు దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం-నమస్తే తెలంగాణ దినపత్రిక భాగస్వామ్యంతో ఏటా జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న కథల పోటీలతో ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే ప్రాధాన్యతను సంతరించుకున్నది.
– హనుమకొండ సబర్బన్/ భీమదేవరపల్లి
హనుమకొండ జిల్లాలోని ముల్కనూరు గ్రామానికి చెందిన అనేకమంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం నిత్యం హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్తుంటారు. అయితే, ఇతర సమయాల్లో ఇక్కడి విద్యార్థులు చదువుకునేందుకు పుస్తకాలు కానీ, ఇతర సదుపాయాలు కానీ అందుబాటులో ఉండేవి కాదు. చెప్పేవారు కూడా ఎవరూ లేకపోవడంతో పోటీ పరీక్షల్లో వెనుకబడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన 1982-83 పదో తరగతి విద్యార్థులు సరికొత్తగా ఆలోచించారు. వీరంతా ఒకసారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అందరిలా దావతులు చేసుకొని వెళ్లకుండా, చిరకాలం గుర్తుండేలా గ్రామానికి ఏదైనా మంచి చేయాలని తీర్మానించారు. ముందుగా స్పందన చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు.
మొదట గ్రామంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తర్వాత అందరూ ఆలోచించి మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని భావించి ముల్కనూరు ప్రజాగ్రంథాలయం పేరిట లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుత సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ప్రధానపాత్ర పోషించారు. 2014లో ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు విరివిగా సహకారాన్ని అందించారు. ముందుగా అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాలతో గ్రామం నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే 8 గుంటల భూమిని కేటాయించారు. ఆ తర్వాత అప్పటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు రూ.10లక్షలు, అప్పటి ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ రూ.10లక్షలు, అప్పటి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ. 5లక్షలు వారి నిధులనుంచి కేటాయించగా, స్పందన చారిటబుల్ ట్రస్టు, ముల్కనూరు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి మరో రూ. 10లక్షలు సమకూర్చారు. మంచి భవనాన్ని నిర్మించారు. దీనికి తోడు వేముల శ్రీనివాసులుతోపాటు ఇతరులు తమకున్న పరిచయాలతో పోటీ పరీక్షల కోసం అనేక రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రంథాలయాల్లో తొలిసారి ముల్కనూరు ప్రజాగ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌గా మార్చారు.
ముల్కనూరు ప్రజాగ్రంథాలయం దశాబ్ది ఉ త్సవాలకు సిద్ధమైంది. నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా ఏటా కథల పోటీలు నిర్వహిస్తున్నది. ఇదే తరహాలో కథల పోటీలు – 2023 సంత్సరానికిగాను ఇప్పటికే విజేతల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, నేడు దశాబ్ది ఉత్సవాల వేదిక పైనే బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలుగు కవి అందెశ్రీ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి హాజరుకానున్నట్లు నిర్వాహకులు సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ వంగ రవి తెలిపారు.