జనగామ, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): జనగామలో కాంగ్రెస్ వర్గపోరు బహిర్గత మైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ఆయన వ్యతిరేక వర్గం ప్రతి రోజూ తమ అసమ్మతి, అసహనా న్ని వెల్లగక్కుతున్నారు. తాజాగా మంగళవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి దూషించుకున్నారు.కలెక్ట రేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభా వేదికపైకి అధికారులు ఐలయ్యను ఆహ్వానించగా ఆయన వెంటే కొమ్మూరి కూడా వెళ్లి కూర్చున్నారు.
దీంతో కొమ్మూరి వ్యతిరేక వర్గం నాయకులైన మున్సిపల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ రిజ్వాన్, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జోక్యం చేసుకొని కిందకు వెళ్లి కూర్చోవాలంటూ కొమ్మూరికి నచ్చజెప్పారు. చేసేదేమీలేక కిం దకు దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు వర్గాల కాంగ్రెస్ నాయకులు ‘నువ్వెంతంటే నువ్వెంత’, ‘మీ లాంటి వారి వల్లే పార్టీ కాంగ్రెస్ సర్వనాశనమవుతున్నది’ అంటూ ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజా పాలన పేరిట ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అధికార పార్టీ నాయకులు ఇలా బహిరంగంగా ఒకవర్గంపై మరొకరు దూషణలకు దిగడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉదయం కొమ్మూరి వ్యతిరేక వర్గం నాయకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసి, ఆ తర్వాత ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లడం వర్గపోరును మరింత రాజేసింది. అంతేకాకుండా ఐలయ్యకు స్వాగతం పలుకుతూ కొమ్మూరి ఫొటో లేకుండా ఆయన వ్యతిరేక వర్గం నాయకుల పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. డీసీసీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులకు మధ్య గ్యాప్ పెరిగి రెండు గ్రూపులు విడిపోయి వ్యతిరేకవర్గం నాయ కులంతా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డితో సఖ్యతగా మెలగడం గమనార్హం.